నితేష్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే!
రామాయణం కథ ఆధారంగా ఎన్నిసార్లు ఎంతమంది సినిమాలు చేసినా, ప్రతీసారీ కొత్త అనుభూతే ఉంటుందని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ అన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Aug 2025 10:00 PM ISTరామాయణం కథ ఆధారంగా ఎన్నిసార్లు ఎంతమంది సినిమాలు చేసినా, ప్రతీసారీ కొత్త అనుభూతే ఉంటుందని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ అన్నారు. ఇప్పటికే రామయణం ఆధారంగా పలు సినిమాలు, సీరియల్స్, సిరీస్‌లు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా కూడా వచ్చింది.
అయితే వాటిలో ఆదిపురుష్ సినిమా విషయంలో కొన్ని తప్పిదాలు జరగడం వల్ల సినిమా దారి తప్పి ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. ఇప్పుడదే కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో రామాయణ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ 45కి పైగా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
చాలా గర్వంగా ఉంది
ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తుండగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. రామాయణంలో తన పాత్రపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సన్నీ డియోల్ స్పందించి మాట్లాడారు. రామాయణంలో హనుమంతుడి పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఉందని, తన పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా, ఎనర్జిటిక్ గా మరియు అల్లరితో కూడుకుని ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఎక్కడా రాజీ పడటం లేదు
త్వరలోనే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుందని, ఎప్పుడైనా సరే ఇలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని, పాత్రలో పూర్తిగా లీనమైతే తప్ప మంచి అవుట్‌పుట్‌ను ఇవ్వలేమని సన్నీ డియోల్ అభిప్రాయపడ్డారు. రామాయణ తో ఆడియన్స్ కు మంచి అనుభూతిని అందించడానికి చిత్ర యూనిట్ నిరంతరం కష్టపడుతోందని, హాలీవుడ్ నిర్మాణ విలువలతో సినిమా చాలా గొప్పగా రూపొందుతుందని, ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని ఆయన చెప్పారు. సన్నీ డియోల్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ నితేష్ తివారీ ఈ సినిమాను చాలా భారీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణంలో ఎంతో కీలకమైన హనుమంతుడి పాత్ర ఎంతో అల్లరిగా ఉంటుందని చెప్తున్నారంటే నితేష్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది.
