హిందూ- ముస్లిమ్ సంఘర్షణలు ఘర్షణలతో అట్టుడికిస్తున్న ట్రైలర్
ఈ చిత్రంలో సన్నీ డియోల్ `సికందర్ మీర్జా` అనే ముస్లిం శరణార్థి పాత్రలో కనిపించగా..అతడి భార్య `హమీదా బేగం` పాత్రను ప్రీతి జింటా పోషించారు.
By: Sivaji Kontham | 29 July 2026 6:24 PM ISTఇండియన్ సినిమా హిస్టరీలో డియోల్ కుటుంబానికి ఒక చెరగని పేజీ ఉన్న సంగతి తెలిసిందే. గద్దర్ సీక్వెల్ తో సన్నీడియోల్ 2.0 రీబూట్ వెర్షన్ గా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అతడిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. సన్నీ డియోల్.. ఇప్పుడు తన ఫేవరెట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్ లో నటించారు. ఈ కాంబినేషన్ కు ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఘాయల్, దామిని, ఘాతక్ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం `బట్వారా 1947` ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ -అపర్ణా పురోహిత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చారిత్రక డ్రామా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. 1947 దేశ విభజన నేపథ్యంలో మానవత్వం, మత సామరస్యమే ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ నెటిజన్ల నుండి విపరీతమైన ప్రశంసలను అందుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ `సికందర్ మీర్జా` అనే ముస్లిం శరణార్థి పాత్రలో కనిపించగా..అతడి భార్య `హమీదా బేగం` పాత్రను ప్రీతి జింటా పోషించారు. దేశ విభజన నాటి కల్లోలంలో తమ స్వస్థలాన్ని వదిలి లాహోర్‌కు వలస వెళ్లిన ఈ కుటుంబానికి ప్రభుత్వం ఒక పాతకాలపు పెద్ద భవంతిని కేటాయిస్తుంది. అయితే ఆ ఇంటి మేడపై `దుర్గావతి దేవి` అనే వృద్ధ హిందూ మహిళ (షబానా అజ్మీ) ఇంకా నివసిస్తూ ఉండటాన్ని..అక్కడ తన పూర్వీకుల ఇల్లు .. పూజా మందిరాన్ని వదిలివెళ్లడానికి నిరాకరించడం ఉత్కంఠను పెంచుతాయి.
ఈ క్రమంలో ఆ వృద్ధురాలి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియడంతో విలన్లు అభిమన్యు సింగ్, అలీ ఫజల్ ఆమెను ఖాళీ చేయించి పూజా మందిరాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రధాన పాత్రధారి సికందర్ (సన్నీ డియోల్) ఆ వృద్ధురాలికి అండగా నిలుస్తారు. ఏ మతమైనా ఆరాధనా స్థలాలను కూల్చివేయమని చెప్పదు.. మతాలన్నింటికంటే `అమ్మ` స్థానమే ప్రథమ మతం! అని స్పష్టం చేస్తూ, వృద్ధురాలిని కాపాడటానికి తన కుటుంబంతో కలిసి పోరాటానికి దిగుతారు.
ఈ సన్నివేశాలు, శక్తివంతమైన సంభాషణలు ట్రైలర్‌లో ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్నాయి. ఈ కథ ఏ కాలంలో జరిగిందో చూడాలి.. సన్నీ పాజీ - రాజ్‌కుమార్ సంతోషి కాంబోలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయం! అని సోషల్ మీడియాలో వీక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అస్ఘర్ వజాహత్ రాసిన పాపులర్ నాటకం ఆధారంగా రాజ్‌కుమార్ సంతోషి స్క్రీన్‌ప్లే రూపొందించగా.. ప్రఖ్యాత కెమెరామెన్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ స్వరాలు, జావేద్ అక్తర్ సాహిత్యంతో ఈ చిత్రానికి మరింత బలం చేకూరింది.
సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా అజ్మీలతో పాటు కరణ్ డియోల్ (జావేద్ మీర్జా పాత్రలో) ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దేశ విభజన నాటి భయానక వాతావరణంలోనూ మానవత్వం, సహజీవనం, మాతృత్వపు విలువలను చాటిచెప్పే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
