Begin typing your search above and press return to search.

మూడు ద‌శాబ్దాల త‌ర్వాత సంచ‌ల‌న కాంబినేష‌న్!

1997లో జేపీ దత్తా దర్శకత్వంలో తెర‌కెక్కిన బాలీవుడ్ క్లాసిక్ వార్ డ్రామా `బోర్డర్` ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన‌ ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   21 Jun 2026 4:00 AM IST
మూడు ద‌శాబ్దాల త‌ర్వాత సంచ‌ల‌న కాంబినేష‌న్!
X

1997లో జేపీ దత్తా దర్శకత్వంలో తెర‌కెక్కిన బాలీవుడ్ క్లాసిక్ వార్ డ్రామా `బోర్డర్` ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన‌ ప‌నిలేదు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు తమ పాత్రలతో ప్రేక్ష‌కుల్ని ఎంతో మెప్పించారు. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ యాక్షన్ .. యువ నటుడిగా అక్షయ్ ఖన్నా చూపిన పరిణతి ఆ చిత్ర విజయానికి ప్రధాన మూల స్తంభాలుగా నిలిచాయి. ఆ తర్వాత మళ్లీ ఇద్ద‌రినీ ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అవ‌కాశం మాత్రం రాలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పలు సంద‌ర్భాలు రిక్వెట‌స్్ చేసినా? అంత పాజిటివ్ రెస్పాన్స్ మేక‌ర్స్ నుంచి రాలేదు.

అయితే దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావ‌డం బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా తెర‌కెక్కించ‌నున్న‌ `ఇక్కా` అనే సరికొత్త చిత్రం ద్వారా సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ అద్భుతమైన కలయిక గురించి అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి అభిమానుల్లో.. విశ్లేషకులలో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రీ-యూనియన్ వెనుక పాత జ్ఞాపకాలను లేదా బోర్డర్ సినిమా క్రేజ్‌ను వాడుకునే ఉద్దేశ్యం లేదని దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా స్పష్టం చేశారు.

పబ్లిసిటీ కోసం కాకుండా సిద్ధం చేసుకున్న కథకు ఆ ఇద్ద‌రు మాత్రమే సరైన న్యాయం చేయగలరనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కథలోని పాత్రల స్వభావం, వాటి మధ్య ఉండే సంఘర్షణకు సన్నీ, అక్షయ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో అవసరమని దర్శకుడు బలంగా భావిస్తున్నారు. సన్నీ డియోల్ - అక్షయ్ ఖన్నా ఇద్దరికీ చిత్ర పరిశ్రమలో భిన్నమైన నటనా శైలి ఉంది. ఒకరు తీవ్రమైన ఆవేశం, పవర్‌ఫుల్ డైలాగులతో థియేటర్లలో మాస్ రెస్పాన్స్ రాబట్టగలరు. మరొకరు నిశ్శబ్దంగా ఉంటూనే కళ్లతో .. సూక్ష్మమైన హావభావాలతో లోతైన క్లాస్ నటనను ప్రదర్శించగలరు.

అలాంటి న‌టులు ఇద్ద‌రు ఒకే కథలో తలపడినప్పుడు వెండితెరపై అద్భుతమైన డ్రామా కు అవ‌కాశం ఉంటుంది. `ఇక్కా` చిత్రంలో ఆ ఇద్ద‌రి పాత్రల రూపకల్పన ఆ స్థాయిలోనే ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. ప్రస్తుత బాలీవుడ్ ట్రెండ్‌లో యువ హీరోల చిత్రాలకే కాకుండా బలమైన కంటెంట్ ఉన్న సీనియర్ స్టార్స్ సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని పెద్ద చిత్రాల విజయాలు దీనిని నిరూ పించాయి. విభిన్న తరాల నటీనటుల కలయికతో వచ్చే మల్టీస్టారర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. సినిమా రంగానికి సరికొత్త ఊపును ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో `ఇక్కా` చిత్రం కూడా అదే బాటలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.