ఇది నా ఇల్లు.. నా ప్రజల భాష
నా మూలాలు, జ్ఞాపకాలు, నా ప్రజలు, నా ఇల్లు అన్నీ ఈ భాషలోనే ఉన్నాయి` అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
By: Srikanth Kontham | 20 Sept 2026 8:00 AM ISTదక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తులు భాషకు అదనపు అధికారిక భాషా హోదా కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తన హృదయానికి ఎంతో దగ్గరైందని, తన మాతృభాషకు దక్కిన ఈ గౌరవం పట్ల ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం అనంతరం సునీల్ శెట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.`ఇది కేవలం నేను మాట్లాడే భాష మాత్రమే కాదు. నేను ఎవరిని అనేదానికి నిదర్శనం.
నా మూలాలు, జ్ఞాపకాలు, నా ప్రజలు, నా ఇల్లు అన్నీ ఈ భాషలోనే ఉన్నాయి` అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తరతరాలుగా ఈ భాషను, సంస్కృతిని ప్రేమతో కాపాడుకుంటూ వస్తున్న ప్రతి తులువాకి ఇది గర్వకారణమైన రోజని కొనియాడారు. సెప్టెంబర్ 18న మంగళూరులో జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో కర్ణాటక క్యాబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తులు భాష ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కన్నడ , ఉడుపి జిల్లాల్లో పాలనాపరమైన అవసరాల కోసం తులు భాషకు అదనపు అధికారిక భాషా హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రజల సుదీర్ఘకాల స్వప్నం నెరవేరినట్లయింది. సునీల్ శెట్టికి తులు భాష , ఆ ప్రాంతంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. మంగళూరు సమీపంలోని ముల్కి ప్రాంతానికి చెందిన తులు మాట్లాడే `బంట్` కుటుంబంలో ఆయన జన్మించారు. బాలీవుడ్‌లో ఎంతటి విజయాన్ని అందుకున్నా? తన మూలాలను, సంస్కృతిని ఎప్పుడూ మరచిపోకుండా పబ్లిక్ జీవితంలో ప్రాంతీయ గుర్తింపును సగర్వంగా చాటుకోవడం సునీల్ ప్రత్యేకత.
తులు చిత్రపరిశ్రమలో కూడా సునీల్ శెట్టి అడుగు జాడలున్నాయి. నటుడు , దర్శకుడు రూపేష్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన `జై` అనే కన్నడ-తులు పొలిటికల్ డ్రామా చిత్రంలో అతిథి పాత్రలో నటించడం ద్వారా సునీల్ తులు సినీ రంగ ప్రవేశం చేశారు .2025లో విడుదలైన ఈ చిత్రం ద్వారా తన ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా మద్దతుగా నిలిచారు. ఇటీవల సునీల్ శెట్టి.. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, అర్షద్ వార్సీ వంటి ప్రముఖ నటులతో కలిసి `వెల్‌కమ్ టు ది జంగిల్` చిత్రంలో నటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2026న పునర్వ్య వస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లోని 18 మంది సభ్యులలో ఒకరిగా సునీల్ శెట్టి నియమితులయ్యారు.
