40కోట్ల భారీ ఆఫర్ ను తిరస్కరించిన నటుడు.. ఈ జాబితాలో వారు కూడా!
సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని.. కొంతమంది వ్యాపార సంస్థలు వారి చేత తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తూ భారీగా బిజినెస్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 29 Dec 2025 3:00 PM ISTసినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని.. కొంతమంది వ్యాపార సంస్థలు వారి చేత తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తూ భారీగా బిజినెస్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోటర్ గా మారే ముందు ఆ ఉత్పత్తులు ఏంటి? అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి? వాటి వల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా ? అనే విషయాలను పరిగణలోకి తీసుకొని వాటికి బ్రాండ్ ప్రమోటర్గా మారాల్సి ఉంటుంది. ఒకవేళ అవేవీ పట్టించుకోకుండా కేవలం డబ్బు మాత్రమే చూసి ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే మాత్రం విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే అందులో కొంతమంది సెలబ్రెటీలు డబ్బుకు ఆశపడి.. గుట్కా, పాన్ మసాలా, పొగాకు, లిక్కర్ వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా మారి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ , టైగర్ ష్రాఫ్ వంటి బడా హీరోలు ఈ పాన్ మసాలా యాడ్ కి ప్రమోటర్స్ గా మారి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే మరికొంతమంది కోట్ల రూపాయలను ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించి అభిమానుల చేత ప్రశంసలు పొందుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ నటుడు కూడా ఏకంగా 40 కోట్ల భారీ ఆఫర్ ను తిరస్కరించారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఈయనకు పొగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేయడానికి 40 కోట్ల ఆఫర్ చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.." నాకు ఒక పొగాకు ప్రకటన కోసం 40 కోట్లు ఆఫర్ చేశారు. కానీ నేను డబ్బుకి లొంగిపోయే వాడిని కాదు అని సున్నితంగా తిరస్కరించాను" అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సునీల్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటివరకు ఇలా పొగాకు బ్రాండ్ ను తిరస్కరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. వారిలో ప్రధమంగా వినిపించే పేరు అల్లు అర్జున్. గుట్కా, లిక్కర్ కంపెనీల నుండి భారీగా ఆఫర్లు వచ్చినా.. హానికరమైన అలవాట్లను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ తిరస్కరించారు. అనిల్ కపూర్.. పాన్ మసాలా యాడ్ కు ప్రమోట్ చేయమని అడగగా.. ఆయన దీనిపై స్పందిస్తూ పాన్ మసాలా ప్రకటనలను చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇలాంటి వాటికి నేను సపోర్ట్ చేయను అని తెలిపారు.
ఇక వీరితో పాటు జాన్ అబ్రహం, కార్తీక్ ఆర్యన్ , కే జిఎఫ్ నటుడు యష్, స్మృతి ఇరానీ ఇలా చాలా మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గుట్కా యాడ్స్ ను తిరస్కరించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
