సిగ్మాపై సందీప్ స్పెషల్ బాధ్యత
హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన సూపర్ సుబ్బు సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
By: Sravani Lakshmi Srungarapu | 1 July 2026 7:00 PM ISTహీరో సందీప్ కిషన్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన సూపర్ సుబ్బు సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం మాత్రం అతని తర్వాతి సినిమా సిగ్మా. తమిళ స్టార్ హీరో విజయ్ కొడుస్ జేసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఆ ఆసక్తిని మరింత పెంచాయి.
సిగ్మా తన కెరీర్‌లో కేవలం మరో సినిమా కాదని, ఇది తనపై అదనపు బాధ్యతను మోపిన ప్రాజెక్ట్ అని సందీప్ చెప్పాడు. సాధారణంగా స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. కానీ జేసన్ సంజయ్ మాత్రం హీరోగా కాకుండా ముందుగా డైరెక్టర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవడం తనను బాగా ఆకట్టుకుందని తెలిపాడు. కెరీర్ లో తనకెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కష్టపడి డైరెక్షన్ తో తన కెరీర్ ను స్టార్ట్ చేయాలని తీసుకున్న డెసిషన్ ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రపంచంలో ఎంతోమంది ఉండగా తన మొదటి సినిమాకు హీరోగా తననే ఎంచుకోవడం ఆ బాధ్యతను మరింత పెంచిందని సందీప్ వెల్లడించాడు. అందుకే షూటింగ్ సమయంలో ప్రతి రోజూ ఎంతో బాధ్యతతో పనిచేశానని చెప్పాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని, ప్రేక్షకులందరికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.
విజయ్‌తో తన మీటింగ్ ను కూడా సందీప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. విజయ్ ను కలిసినప్పుడు నా కొడుక్కి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పారని, కానీ అది మర్యాదపూర్వకంగా అన్న మాటగా భావించి మీరు ఊరుకోండన్నా మీ మంచితనంతో చెప్తున్నారని నవ్వి బయటికొచ్చానని, తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు. కానీ తర్వాత సంజయ్ మూడున్నర గంటల ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ఎంతో నమ్మకంతో తనకు చెప్పడంతో, అతను తనపై ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదో అర్థమైందని చెప్పాడు. అప్పట్నుంచే ఈ ప్రాజెక్ట్‌ను మరింత బాధ్యతగా తీసుకోవాలని నిర్ణయించుకున్నానని సందీప్ వెల్లడించాడు.
తాను నటించిన మా నగరం, ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలను సంజయ్ పలుమార్లు చూసి, అందులోని కొన్ని సీన్స్ ను గుర్తుపెట్టుకుని మరీ మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సందీప్ తెలిపాడు. సిగ్మా షూటింగ్ పూర్తయ్యే సరికి సంజయ్ తనకు సొంత తమ్ముడిలా మారిపోయాడని, ఇప్పుడు అతని తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా వస్తుందో అన్న ఉత్సాహంతో పాటు సహజంగానే కొంత టెన్షన్ కూడా ఉందని చెప్పాడు. సందీప్ మాటలను బట్టి చూస్తే, సిగ్మా కేవలం ఓ కమర్షియల్ యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఓ స్టార్ హీరో కొడుకు డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కీలక ప్రాజెక్టు అని, అదే సమయంలో ఓ హీరో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యతతో చేసిన ప్రాజెక్ట్ కూడా అని అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
