Begin typing your search above and press return to search.

హీరోయిన్ సక్సెస్‌ను లెక్కల్లో బంధించొద్దంటున్న హీరో!

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు వరుసగా స‌క్సెస్‌లు వస్తే వెంటనే ఆమె గురించి మాట్లాడటం మొదలవుతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Sept 2026 4:34 PM IST
హీరోయిన్ సక్సెస్‌ను లెక్కల్లో బంధించొద్దంటున్న హీరో!
X

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు వరుసగా స‌క్సెస్‌లు వస్తే వెంటనే ఆమె గురించి మాట్లాడటం మొదలవుతుంది. అయితే అదే టైమ్ లో మరో హీరోయిన్‌ను ఆమెతో పోల్చడం కూడా మొదలవుతుంది. ఎవరి సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి? ఎవరి హిట్ రేషియో ఎక్కువ? ఎవరు స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు? అంటూ సక్సెస్‌ను కొన్ని లెక్కలతోనే కొలిచే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఈ విధానంపైనే మరోసారి డిస్క‌ష‌న్ కు తెరలేపాయి.

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించిన సిగ్మా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఫరియాను ఆమె సక్సెస్ రేషియో గురించి ప్రశ్నించగా, సందీప్ ఇచ్చిన సమాధానం ఆసక్తిని రేకెత్తించింది. చిన్న వయసులోనే ఫరియా పలు సినిమాలు చేయడంతో పాటు సొంతంగా ఇల్లు, కారు కొనుక్కోవడం, తల్లిదండ్రులను సెటిల్ చేయడం, హిట్లు అందుకోవడం, అవార్డులు గెలుచుకోవడం లాంటివి జ‌రిగాయని, అలాంటి విష‌యాల‌ను కూడా సక్సెస్‌లో భాగంగా చూడాలని ఆయన చెప్పిన తీరు ఇప్పుడు మరో ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒక హీరోయిన్ కు సక్సెస్ అంటే కేవలం బాక్సాఫీస్ లెక్కలేనా? అనేది ఆలోచించాల్సిన అంశంగా మారింది.

అంతేకాదు, మరో హీరోయిన్ విషయంలో కూడా ఇటీవల ఇలాంటి పోలికలే ఎదురయ్యాయని సందీప్ ప్రస్తావించారు. ఆమెతో కలిసి నటించిన మరో హీరోయిన్‌కు వరుసగా మూడు బ్లాక్‌బస్టర్లు వచ్చాయని, మరి ఆమె సినిమాలకు అలాంటి కలెక్షన్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడే అసలు సమస్య కనిపిస్తుందని ఆయన అభిప్రాయప‌డ్డారు. ఒక హీరోయిన్ ఇప్పుడిప్పుడే తన కెరీర్‌లో పైకి వస్తున్నాననే సంతోషాన్ని ఆస్వాదిస్తున్న టైమ్ లో, వెంటనే మరో హీరోయిన్ తో పోల్చడం ద్వారా ఆ స‌క్సెస్ ను చిన్నదిగా చూడటం ఎంతవరకు సమంజసం అనేది ఆయ‌న‌ ప్రశ్న.

వాస్త‌వాఇనికి ప్రతి హీరోయిన్‌ కెరీర్‌కు ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉంటుంది. కథల ఎంపిక, పాత్రల పరిధి, సినిమా జానర్, మార్కెట్, డైరెక్ట‌ర్లు, రిలీజ్ టైమ్.. ఇలా ఎన్నో అంశాలు ఒక సినిమా రిజ‌ల్ట్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఒకరి స‌క్సెస్‌ను మరొకరి కెరీర్‌కు కొలమానంగా పెట్టడం ఎప్పుడూ క‌రెక్ట్ కాదు. హీరోయిన్లను హిట్ రేషియో, కలెక్షన్స్ లేదా గ్లామర్ కోణంలోనే కాకుండా వారి కెరీర్ జ‌ర్నీ, పాత్రల ఎంపిక, ఎదుగుదల, వారు సాధించిన ప‌ర్స‌న‌ల్ టార్గెట్స్ గురించి కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే డిస్క‌ష‌న్ మొదలవుతోంది.

సందీప్ మాటల్ని చూస్తే ఆయన కేవలం తన కో స్టార్‌ను సమర్థించడం మాత్రమే కాకుండా, తనతో వ‌ర్క్ చేసిన నటీనటుల కెరీర్ జర్నీని గమనించే కో స్టార్‌గా కనిపించారు. ప్రతి ఒక్కరి జ‌ర్నీకి ఒక ప్రాసెస్ ఉంటుందని ఆయన చెప్పిన మాటలు.. సక్సెస్‌ను పోలికలతో కాకుండా ప్రయాణంతో చూడాలనే దృక్పథాన్ని ముందుకు తెచ్చాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్లను అడిగే ప్రశ్నలు కూడా మారాల్సిన సమయం వచ్చిందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది.