తరతరాలకు చిరంజీవి గారే గురువు.. 'సిగ్మా' ప్రీ-రిలీజ్‌లో సందీప్ కిషన్ ఎమోషనల్
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సిగ్మా` (SIGMA) ప్రీ-రిలీజ్ వేడుక మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
By: Sivaji Kontham | 26 Sept 2026 8:53 AM ISTసందీప్ కిషన్ హీరోగా నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సిగ్మా` (SIGMA) ప్రీ-రిలీజ్ వేడుక మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో హీరో సందీప్ కిషన్ తన భావోద్వేగభరితమైన ప్రసారంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎదురుగా తన ఆరాధ్య దైవం, మెగాస్టార్ చిరంజీవి కూర్చోవడంతో కాస్త టెన్షన్‌గా ఉందని చెబుతూనే గత 16 ఏళ్ల తన సినీ ప్రయాణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తనకు అందించిన సంపూర్ణ మద్దతును వేదికపై గుర్తుచేసుకున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు.. తన తరానికి మాత్రమే కాకుండా రాబోయే ప్రతి తరానికి చిరంజీవిగారే అసలైన గురువని సందీప్ కొనియాడారు. కేవలం రికార్డులు, విజయాలే కాకుండా కష్టకాలంలో కొత్త దర్శకులకు అండగా నిలవడం, బ్లడ్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి స్పూర్తినివ్వడం ఆయన గొప్పతనమని తెలిపారు. తన 16 ఏళ్ల కెరీర్‌లో ఇంత పెద్ద స్టార్ తన సినిమా వేడుకకు వచ్చి మద్దతు ఇవ్వడం జీవితంలో మరువలేని క్షణమని భావోద్వేగానికి గురయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ జేసన్ సంజయ్‌తో పనిచేసిన అనుభవాన్ని సందీప్ పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ తన వద్దకు వచ్చినప్పుడు మొదట ఆశ్చర్యపోయినా.. జేసన్ సంజయ్ చెప్పిన కథ.. అతడి నరేషన్ విధానం తనను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎవరి సిఫార్సులు లేకుండా కేవలం తన సొంత ప్రతిభపైనే ఆధారపడి ఇండస్ట్రీలో నిలబడాలని తపన పడుతున్న 24 ఏళ్ల జేసన్ సంజయ్ కమిట్‌మెంట్‌ను ఈ సందర్భంగా సందీప్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
`సిగ్మా` సినిమా ఎలాంటి గ్యాంబ్లింగ్ జోనర్ కాదని.. ఇదొక చక్కటి ఫన్, యాక్షన్, కామెడీతో కూడిన రూటెడ్ సౌత్ ఇండియన్ ఎంటర్‌టైనర్ అని సందీప్ స్పష్టం చేశారు. వెంకట్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు చాలా యూనిక్‌గా ఉంటాయని.. కేవలం 63 రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టిన ఘనత సంజయ్‌కే దక్కుతుందని కొనియాడారు. తమన్ అందించిన సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తన జీవితంలో కెమెరా ముందు మొదటిసారిగా నటించిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ప్రసంగాన్ని ముగించారు. మెగాస్టార్ నటించిన `స్టాలిన్` సినిమా షూటింగ్ సమయంలో తాను ఫేస్ చేసిన ఫస్ట్ డైలాగ్ ``ముగ్గురికి సాయం చేయి...`` అనే సిద్ధాంతమే తన జీవితానికి మూలమని తెలిపారు. మెగాస్టార్ చూపిన ఆదర్శవంతమైన మార్గంలోనే తాను కూడా ముందుకు సాగుతానని చెబుతూ.. అభిమానులందరూ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న `సిగ్మా` చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, జేసన్ సంజయ్, ఎస్.ఏ చంద్రశేఖర్, ఫరియా అబ్ధుల్లా తదితరులు పాల్గొన్నారు.
