సుందర్.. రజినీ, కమల్‌లకు తెలియకుండానే?
తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. చాలా ఏళ్ల నుంచి రొటీన్ హార్రర్ కామెడీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు.
By: Garuda Media | 15 Nov 2025 5:03 PM ISTతమిళ సీనియర్ దర్శకుడు సుందర్ పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. చాలా ఏళ్ల నుంచి రొటీన్ హార్రర్ కామెడీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. పెద్ద స్టార్లెవ్వరూ తనతో సినిమాలు చేయడం లేదు. ఇలాంటి టైంలో ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం రావడం అద్భుతమే అనుకున్నారంతా. పైగా ఈ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాత కావడంతో సుందర్ నక్క తోక తొక్కాడనే కామెంట్లు వినిపించాయి. కానీ ఈ సంబరం పది రోజులకు పరిమితమైంది. సుందర్‌ను ఈ క్రేజీ మూవీకి దర్శకుడిగా ప్రకటించిన కొన్ని రోజులకే అతను తప్పుకున్నాడు. ఈ మేరకు అతను మీడియాకు ప్రకటన ఇచ్చేశాడు. ఐతే సుందర్ ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్న విషయమే రజినీ, కమల్‌లకు తెలియదట. తమకు సమాచారం ఇవ్వకుండానే అతను ఇలా.. తాను సినిమా నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మీడియాకు వెల్లడించడం పట్ల ఆ ఇద్దరు లెజెండ్స్ కొంత ఆగ్రహంతో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
తమిళ సినీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా కమల్ హాసన్ ఒక లైన్ చెప్పి దాన్ని డెవలప్ చేయమని సుందర్‌ను కోరాడట. కానీ అది సుందర్‌కు నచ్చక దాన్ని పక్కన పెట్టేశాడట. ఆ తర్వాత ఒక హార్రర్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ కథకు సంబంధించిన లైన్‌ను సుందర్ చెప్పగా.. అది ఆసక్తికరంగా అనిపించి, దాన్ని ఫుల్ స్క్రిప్టుగా చేసుకుని రమ్మని రజినీ, కమల్ చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలోనే సుందర్‌ను దర్శకుడిగా ప్రకటించారట. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసి కమల్‌కు చెప్పగా.. ఆయనకు అదంత బాగా అనిపించలేదట. కానీ సహ నిర్మాతలకు ఈ కథ నచ్చిందట. చివరగా రజినీకి సుందర్ స్క్రిప్టు నరేట్ చేయగా ఆయన పెదవి విరిచారట. ఇటు కమల్, అటు రజినీ ఇద్దరి నుంచి తిరస్కారం రావడంతో సుందర్ ఈ ప్రాజెక్టును వర్కవుట్ చేయడం కష్టమని భావించి.. తనకు తానుగా సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేశాడు. సుందర్ మరో కథతో వస్తాడేమో అని అనుకున్న రజినీ, కమల్.. ఈ నిర్ణయంతో షాకయ్యారని కోలీవుడ్లో డిస్కషన్ నడుస్తోంది.
