నా చెప్పు సైజు 41.. దెబ్బలకు రెడీనా? రజనీ ఫ్యాన్స్‌పై ఖుష్బూ ఫైర్!
ఇటీవలే సుందర్ సి దర్శకత్వంలో రజనీకాంత్- కమల్ హాసన్ కాంబినేషన్ మూవీ తలైవర్ 173ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 20 Nov 2025 7:25 PM ISTఇటీవలే సుందర్ సి దర్శకత్వంలో రజనీకాంత్- కమల్ హాసన్ కాంబినేషన్ మూవీ తలైవర్ 173ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టును ప్రకటించిన కొద్దిరోజులకే తాను దీని నుంచి తప్పుకుంటున్నట్టు సుందర్ సి అధికారికంగా పత్రిక ద్వారా ప్రకటించారు. దానికి తన కారణాలు తనకు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు.
అయితే స్క్రిప్టు వర్కవుట్ కాకపోవడం వల్లనే అతడు ప్రాజెక్టు నుంచి వైదొలిగాడని వెల్లడైంది. కమల్ హాసన్ సైతం తాము రజనీకాంత్ కి నచ్చే స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. సరైన స్క్రిప్ట్ లాక్ అయ్యాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కానీ ఆ తర్వాత సుందర్.సిపై తలైవా రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాల్లో అనూహ్య వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
అతడు, అతడి కుటుంబంపై కొన్ని అసహ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా దీనిని సుందర్ సి సతీమణి ఖుష్బూ సహించలేని పరిస్థితికి చేరుకుంది. నిర్మాతలు సరైన స్క్రిప్ట్‌ను ఖరారు చేయడంపై దృష్టి సారించినా కానీ, కుష్బూ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నందున ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
తలైవర్ 173 నుండి సుందర్ సి ఎగ్జిట్ ని అనవసర వివాదాలతో ముడిపెట్టడానికి చాలా మంది నెటిజనులు ప్రయత్నించగా ఆమె ఎదురు దాడికి దిగారు. ``రజనీకాంత్ ఈ సినిమాలో కుష్బూను ఐటెం సాంగ్‌లో నటించమని కోరినందున దర్శకుడు ఆ పాత్ర నుంచి తప్పుకున్నాడ``ని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. అయితే దీనికి ఖుష్బూ సూటిగా కౌంటర్ ఇచ్చారు. ``లేదు, దాని కోసం మీ కుటుంబం నుండి ఎవరినైనా తీసుకోవాలని మేం ఆలోచిస్తున్నాము`` అని ఎదురుదాడి చేసారు.
మరొక ట్రోలర్ ఇలా అన్నాడు. ``సుందర్ సి దయనీయమైన కథ కథనం కారణంగా రజనీ- కమల్ మీ భర్తను తమ బ్యానర్ చిత్రం నుండి బయటకు గెంటేసారు కాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమ మీ భర్త సుందర్ సిని చెత్తబుట్టలో పడవేయాల్సిన సమయం ఆసన్నమైందా?`` అని రాసాడు. దీనికి ఖుష్బూ ఘాటుగా స్పందించారు. ``నా చెప్పు సైజు 41. దానితో దెబ్బలు తినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?`` అని సీరియస్ అయ్యారు.
నిజానికి కమల్ హాసన్ స్వయంగా సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులను సర్ధుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అభిమానులు ఎమోషనల్ అవ్వాల్సిన పని కూడా లేదు. కానీ సామాజిక మాధ్యమాలలో ఇలాంటి తప్పుడు కూతలతో ఒక మహిళను ఇబ్బంది పెట్టడం కలచి వేసేదే. ఎక్కడ అయినా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేవి చాలా సహజం. కానీ ఇలా అసహ్యకరంగా కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కమల్ సరైన స్క్రిప్టు, దర్శకుడి కోసం వెతుకుతున్నారు. రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే వీలుందని కథనాలు వచ్చినా దానికి ఎలాంటి ధృవీకరణలు లేవు.
