లవర్ తో కుబేర హోమ్లీ బ్యూటీ బ్రేకప్? అసలేం జరిగింది?
యూఏఈకి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో సునయన రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడిందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 16 Jun 2026 3:20 PM ISTప్రేమలో ఉన్న సెలబ్రిటీలు ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం ఎంత సహజమో.. ఆ రిలేషన్ లో ఛేంజెస్ వచ్చినప్పుడు అన్ ఫాలో చేయడం, కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం కూడా అంతే చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు హీరోయిన్ సునయన విషయంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆమె పర్సనల్ లైఫ్ మరోసారి వార్తల్లో నిలిచింది.
యూఏఈకి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో సునయన రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడిందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సునయన- ఖలీద్ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఇద్దరూ పరోక్షంగా తమ రిలేషన్ ను అనౌన్స్ చేస్తూ పోస్టులు పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఖలీద్ తన సోషల్ మీడియా అకౌంట్ లో సునయన చేతిని పట్టుకుని ఉన్న సెల్ఫీ పంచుకోవడంతో పాటు, తన జీవితంలో స్పెషల్ మూమెంట్ అంటూ పేర్కొన్నారు. మరోవైపు సునయన కూడా అదే సందర్భాన్ని సూచించే పోస్టులు పెట్టింది. దీంతో వీరిద్దరూ ఎంగేజ్మంట్ చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే తాజాగా పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. సునయన, ఖలీద్ ఒకరినొకరు ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. అంతేకాదు, గతంలో కలిసి దిగిన ఫొటోలను తమ తమ అకౌంట్స్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఖలీద్.. సునయనతో ఉన్న స్పెషల్ ఫోటోలు డిలీట్ చేయడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
దీంతో వీరి నిశ్చితార్థం రద్దయిందా? లేక వ్యక్తిగత కారణాలతో కొంత దూరంగా ఉన్నారా? అనే చర్చ మొదలైంది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటి ఎఫెక్ట్ ముందుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. అన్ ఫాలో చేయడం, పాత ఫొటోలను డిలీట్ చేయడం వంటి పరిణామాలు అభిమానుల్లో అనేక అనుమానాలకు తావిస్తాయి. సునయన-ఖలీద్ వ్యవహారంలోనూ అదే జరుగుతోంది. అయితే ఆ వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు.
ఇక సునయన సినీ జర్నీ విషయానికి వస్తే.. నాగపూర్ కు చెందిన ఆమె మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చారు. అనంతరం టెన్త్ క్లాస్, సంథింగ్ స్పెషల్, పగలే వెన్నెల, మిస్సింగ్, పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజా చోర వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా తమిళంలో మాత్రం వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. మలయాళం, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
ఇటీవల విడుదలైన కుబేర చిత్రంలో కింగ్ నాగార్జునకు భార్య పాత్రలో హోమ్లీ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. మరోవైపు ఖలీద్ అల్ అమేరీ యూఏఈకి చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. ఇండియాలో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు వైరల్ గా మారిన బ్రేకప్ వ్యవహారంపై సునయన గానీ, ఖలీద్ గానీ అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి మరి.
