మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!
‘రామాయణ’, ‘సీన్’ సినిమాల సందడిలో తెలుగు చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని నిర్మాత ధీరజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సినిమాకు మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లకు వచ్చి చూడటం లేదని అన్నారు. సోషల్ మీడియాలో ప్రశంసించడం కంటే కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తేనే చిన్న చిత్రాలకు ప్రోత్సాహం లభిస్తుందని కోరారు. మంచి తెలుగు కంటెంట్‌ను కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
By: Ramesh Palla | 7 Nov 2026 5:17 PM ISTదీపావళి కానుకగా బాలీవుడ్ మూవీ రామాయణ, కోలీవుడ్ మూవీ సీన్‌లు విడుదల అయ్యాయి. ఆ రెండు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకులకు ఆ రెండు సినిమాలే వినోదాన్ని ఇవ్వబోతున్నాయి, టాలీవుడ్ నుంచి దీపావళి సినిమాలు లేవనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చింది. దాంతో ప్రేక్షకులు రామాయణ సినిమాను చూడాలి, సూర్య ఫ్యాన్స్ సీన్ ను చూడాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ దీపావళికి తెలుగు సినిమా 'సమ్మర్ హాలిడేస్' విడుదలైందనే విషయం చాలా మంది పట్టించుకోవడం లేదు. గత వారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక పెద్ద సినిమా కారణంగా వాయిదా వేశారు. ఈవారం తెలుగు సినిమాలు ఏమీ లేవు కదా, బాక్సాఫీస్ వద్ద కాస్త అయినా సందడి ఉంటుందని సమ్మర్ హాలిడేస్ మేకర్స్ భావించారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమా ను పట్టించుకోవడం లేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మర్ హాలిడేస్ మూవీ రెస్పాన్స్...
ఇటీవల విడుదలైన సమ్మర్ హాలిడేస్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి రివ్యూలు, చూసిన వారు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా, ఫోన్‌ల ద్వారా మీ సినిమాకు మంచి టాక్ వచ్చిందని విన్నాం అంటున్నారు. కానీ వారిలో ఎక్కువ శాతం మంది సినిమాకి వెళ్లడం లేదు. మీ ఫ్యామిలీ మొత్తం తో సినిమా చూస్తేనే ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. తమిళ్, మలయాళం నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయని అంటారు. కానీ తెలుగు నుంచి అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా వస్తే మాత్రం ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. తెలుగు సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్‌తో ఉంటేనే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి రిపోర్ట్‌లు వచ్చిన సినిమాను అయినా థియేటర్ కి వెళ్లి చూస్తే బాగుంటుంది కదా అని నిర్మాత ధీరజ్ అన్నాడు.
నిర్మాత ధీరజ్ ఆవేదన...
నిర్మాత ధీరజ్ ఇంకా మాట్లాడుతూ... సినిమా బాగా ఆడుతుందని చాలా మంది అంటున్నారు. కానీ వారిలో చాలా మంది సినిమాను థియేటర్‌కి వెళ్లి చూడటం లేదు, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాకు పాజిటివ్‌గా రాయడం ద్వారా మాకు ఏమీ రాదు, మీ అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసినప్పుడు మాత్రమే మాకు, ఇలాంటి సినిమాలు తీయాలి అనుకునే వారికి మంచి జరుగుతుంది. ఫిల్మ్ నగర్‌లో ఇలాంటి కథలు పట్టుకుని వందల మంది ఉన్నారు. ఇలాంటి మంచి కథలు ఆధరిస్తేనే వారికి సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది. మా సినిమాకు ఎక్కువ టికెట్ రేట్లు పెట్టలేదు, పిల్లలు చూడకూడని అభ్యంతరక సీన్స్ లేవు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీ గా సినిమాను చూసే విధంగా ఉంది. మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోతారు అనేది కూడా లేదు, ఈ సినిమాను చూస్తే మీ పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి సినిమాలను చూపించడం ద్వారా మీ పిల్లలకు మీరు మంచి విలువలు నేర్పిన వారు అవుతారని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో నిర్మాత వ్యాఖ్యలు వైరల్...
సోషల్ మీడియాలో ధీరజ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల తీరును సున్నితంగా తప్పుబడుతూ, తన ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్‌లో చూడకుండా, థియేటర్ నుంచి వెళ్లి పోయిన తర్వాత ఓటీటీలో చూస్తూ అయ్యో మంచి సినిమాను థియేటర్ లో చూడటం మిస్ అయ్యాం అని ఏడ్వడం ఎందుకు అనేది నిర్మాత ధీరజ్ ఉద్దేశం. తమిళ, మలయాళ కంటెంట్ సినిమాలను చూసి ఆహా.. ఓహో అనడం కంటే తెలుగులో వచ్చిన మంచి సినిమాలను కూడా చూడటం వల్ల తెలుగు ఫిల్మ్ మేకర్స్ ను ప్రోత్సహించిన వారు అవుతారు కదా అనేది ఆయన అభిప్రాయం. ఆ సినిమాలను చూసినట్లుగానే తెలుగు సినిమాలను కూడా చూడాలి అనేది ఆయన అభిప్రాయం. తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలను చాలా అరుదుగా మాత్రమే హిట్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కమర్షియల్ హిట్ మిస్ చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుని టాప్ లో నిలిచిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పరిస్థితి కూడా అదే కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
