చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?
పాజిటివ్ టాక్ వచ్చినా పెద్ద సినిమాల పోటీతో సమ్మర్ హాలిడేస్ ఆశించిన వసూళ్లు సాధించలేకపోతోంది. నవంబర్ 6న విడుదలైన ఈ చిత్రానికి రామాయణం, సీన్ సినిమాలు పోటీగా మారాయి. ఇప్పుడు నవంబర్ 13న కొత్త సినిమాల విడుదలకు ముందు వచ్చే వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
By: M Prashanth | 9 Nov 2026 4:00 PM ISTచిన్న సినిమాకు మంచి టాక్ వస్తే చాలు.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు సినిమా బాగున్నా రిలీజ్ టైమింగ్ కలిసిరాదు. ఇప్పుడు 'సమ్మర్ హాలిడేస్' పరిస్థితి కూడా అలాగే ఉంది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకుల కోసం రూపొందించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నా, అందుకు తగ్గ వసూళ్లు రావడం లేదు. ముఖ్యంగా దీపావళి సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవాలనుకున్న చిత్రబృందానికి పెద్ద సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది.
నిజానికి 'సమ్మర్ హాలిడేస్' రిలీజ్ కోసం నిర్మాత ధీరజ్ మొగిలినేని చాలానే కష్టపడ్డారు. వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' వంటి పెద్ద సినిమాతో పోటీ పడకుండా విడుదల తేదీని మార్చుకున్నారు. కానీ నవంబర్ 6న థియేటర్లలోకి వచ్చేసరికి పరిస్థితి మరోలా మారింది. రణబీర్ కపూర్ 'రామాయణం', సూర్య 'సీన్' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిన్న తెలుగు చిత్రానికి ఆశించిన ఆదరణ దక్కలేదు. రెండు డబ్బింగ్ సినిమాలే పోటీగా మారాయి.
పైగా ఈ సినిమా ప్రమోషన్ల విషయంలోనూ నిర్మాత వెనక్కి తగ్గలేదు. మొదట అనుకున్న రిలీజ్ కోసం ప్రచారం చేసి, వాయిదా తర్వాత మరోసారి ప్రమోషన్లు నిర్వహించారు. కిరణ్ అబ్బవరం వంటి హీరోలను కూడా ఈవెంట్లకు తీసుకొచ్చారు. చిన్నారులు మెయిన్ లీడ్స్ లో నటించిన సినిమాను కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నించారు. అయినా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు.
'సమ్మర్ హాలిడేస్' కథ కూడా ఇప్పటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మ ఊళ్లకు వెళ్లడం, అక్కడ ఏర్పడే స్నేహాలు, ఆటలు వంటి జ్ఞాపకాల నేపథ్యంలో రూపొందించారు. రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించగా జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి కీలక పాత్రలు పోషించారు. శ్రీకర్ నాయన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు నిర్మాత ధీరజ్ కూడా సినిమా పరిస్థితిపై ఇటీవల స్పందించారు. సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం కంటే థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు. తనకు కలెక్షన్ల కంటే తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సినిమా చూడటమే ముఖ్యమని చెప్పారు. టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. మంచి సినిమాలు రావడం లేదని అనేవాళ్లు ఇలాంటి ప్రయత్నాలను కూడా ఆదరించాలని కోరారు.
ఇప్పుడు 'సమ్మర్ హాలిడేస్'కు వచ్చే వీకెండ్ కీలకంగా మారింది. మొదటి వారంలో పెద్ద సినిమాల హడావుడి మధ్య వెనుకబడిన ఈ చిత్రం రెండో వారంలోనైనా పుంజుకుంటుందేమో చూడాలి. ముఖ్యంగా పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకునే కుటుంబాలు థియేటర్లకు వస్తే వసూళ్లు మెరుగుపడే అవకాశం ఉంది. నవంబర్ 13న మరికొన్ని కొత్త సినిమాలు విడుదల కానుండటంతో 'సమ్మర్ హాలిడేస్'కు రెండో వారంలో ఎన్ని షోలు దక్కుతాయనేది చూడాలి.
