Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లోనూ టాలీవుడ్ త‌ర‌హా తంతేనా?

దక్షిణాది చిత్రసీమలో చాలాకాలంగా నడుస్తున్న వివాదాస్పద అంశం స్థానిక నటీమణులకు అవకాశాలు తగ్గడం.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 8:00 PM IST
కోలీవుడ్ లోనూ టాలీవుడ్ త‌ర‌హా తంతేనా?
X

దక్షిణాది చిత్రసీమలో చాలాకాలంగా నడుస్తున్న వివాదాస్పద అంశం స్థానిక నటీమణులకు అవకాశాలు తగ్గడం. టాలీవుడ్‌లో ఈ తరహా అసంతృప్తి తరచూ వ్యక్తమవుతూనే ఉంది. తెలుగు భామలకు బదులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కథానాయికలకే పెద్ద పీట వేస్తున్నారంటూ పలువురు తెలుగు నటీమణులు బహిరంగంగానే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే తరహా వేడి కోలీవుడ్‌కు కూడా పాకింది. తమిళ సినిమా పరిశ్రమలో ప్రతిభ ఉన్న స్థానిక అమ్మాయిలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని.. వారికి ఆడిషన్లు దక్కుతున్నా? పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు రావడం లేదంటూ నటి సుమిత్రా దేవి చేసిన వ్యాఖ్య‌లు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.

సినిమా రంగంలో బాషతో సంబంధం లేకుండా టాలెంట్‌కే ప్రాధాన్యత ఇస్తామని దర్శక-నిర్మాతలు చెబుతున్నా? క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది. సుమిత్రా దేవి ఈ విషయాన్ని లేవనెత్తుతూ తమిళనాట నటనపై మక్కువతో ఎంతోమంది యువతులు నాటకాలు, శాస్త్రీయ నృత్యం మరియు విజువల్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తి చేసి పరిశ్రమలోకి వస్తున్నారని తెలిపారు. అయినా? అగ్ర‌ శ్రేణి చిత్రాల్లో ముంబై .. ఉత్తరాది భామలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన వారిలో బలపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి కేవలం తమిళ చిత్రసీమకే పరిమితం కాలేదు. గతంలో టాలీవుడ్‌లోనూ స్వదేశీ నటీమణులు ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలకు కథానాయికగా అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదని.. కేవలం క్యారెక్టర్ రోల్స్ లేదా చెల్లెలి పాత్రలకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. స్థానిక భాషపై పట్టు, నటనపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ విదేశీ లేదా ఇతర భాషా మోడల్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత స్థానిక నటీమణులకు దక్కకపోవడం పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన లోపంగా మారుతోంది.

అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో స్థానిక అమ్మాయిలు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. కానీ వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్-ఇండియన్ చిత్రాలు ..అగ్ర కథానాయకుల సరసన మాత్రం ఇప్పటికీ ఇతర భాషా నటీమణులనే ఎంచుకోవడం విశేషం. దీంతో లోక‌ల్ టాలెంట్ పరిమిత ప్రాజెక్ట్‌లకే పరిమితం కావాల్సి వస్తోంది.

భాష, యాసపై పట్టు ఉండే స్థానిక నటీమణులను ప్రోత్సహిస్తే వారు పాత్రల్లో జీవించడమే కాకుండా డబ్బింగ్ చెప్పడంలోనూ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారతారనడంలో సందేహం లేదు. ఇతర పరిశ్రమల నుండి నటీమణులను తీసుకోవడంలో తప్పు లేకపోయినా? స్థానిక ప్రతిభను కూడా సమానంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత టాలీవుడ్ .. కోలీవుడ్ మేకర్స్‌పై ఉంది. అలా జరిగినప్పుడే పరిశ్రమ మరింత ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకు సాగుతుంది.