20 ఏళ్ల కల.. 'వారణాసి' లో క్యారెక్టర్ పై అక్కినేని హీరో క్లారిటీ!
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమంత్.
By: Madhu Reddy | 5 Feb 2026 3:26 PM ISTఅక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుమంత్. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రయాణిస్తున్న ఆయన, తాజాగా తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ముఖ్యంగా గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి, తన ప్రాణమిత్రుడు మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి సుమంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రాజెక్ట్‌లో సుమంత్ పాత్ర ఉండబోతుందా? వివరాలు ఇలా వున్నాయి..
రాజమౌళితో పని చేయాలన్న సుదీర్ఘ నిరీక్షణ:
సుమంత్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఆయనకు ఒక తీరని కోరిక ఉందట. అదే దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించడం. సుమారు 20 ఏళ్ల క్రితమే, రాజమౌళిని కలిసి, ఆయన సినిమాల్లో చిన్న పాత్ర ఉన్నా చేయడానికి సిద్ధమని తన ఆసక్తిని వ్యక్తం చేశారట. అంతేకాక ఎవరైనా డైరెక్టర్ తనకు నచ్చితే వాళ్ళ దగ్గరకు వెళ్లి మీ సినిమాలో ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని తానే స్వయంగా వెళ్లి అడుగుతాను అని ఆయన తెలిపారు. ఇక రాజమౌళి సృష్టించే విజువల్ వండర్స్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన పనితీరును తాను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని సుమంత్ ఈ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
మహేష్ బాబుతో స్నేహం.. వారణాసిపై అంచనాలు:
మహేష్ బాబు, సుమంత్ మధ్య ఉన్న స్నేహం గురించి టాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తనకు కేవలం మిత్రుడు మాత్రమే కాదని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు అత్యంత ఇష్టమైన నటుడు అని సుమంత్ తెలిపారు. ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ అడ్వెంచర్ చిత్రంలో తానూ భాగం కావాలని ఎవరికి ఉండదు అని ప్రశ్నిస్తూనే, ఆ ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఒక సామాన్య అభిమానిలా ఎదురుచూస్తున్నట్లు సుమంత్ తెలిపారు.
సుమంత్ ప్రస్థానం:
సుమంత్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. 'మళ్ళీ రావా', 'సీతారామం'గత ఏడాది వచ్చిన 'అనగనగా' వంటి చిత్రాలతో తన నటనలోని మెచ్యూరిటీని చాటుకున్న ఆయన, భవిష్యత్తులో రాజమౌళి వంటి దర్శకులతో పని చేసే అవకాశం వస్తే.. అది తన 20 ఏళ్ల కల నెరవేరినట్లేనని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అక్కినేని , ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. మరి రాజమౌళి గారి సినిమాలో సుమంత్ కోసం ఏదైనా సర్ప్రైజ్ రోల్ ఉంటుందేమో వేచి చూడాలి..
