Begin typing your search above and press return to search.

'దేశ‌ముదురు' ఛాన్స్ వ‌దులుకోవ‌డం అక్కినేని హీరో త‌ప్పిద‌మా?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తనకి `దేశముదురు`కథ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

By:  Sivaji Kontham   |   28 July 2026 10:04 AM IST
దేశ‌ముదురు ఛాన్స్ వ‌దులుకోవ‌డం అక్కినేని హీరో త‌ప్పిద‌మా?
X

తెలుగు చిత్రసీమలో నటులు కథల ఎంపిక విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు మిస్ అయిన కథలు వేరే హీరోల వద్దకు వెళ్ళి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలుస్తుంటాయి. అలాంటి ఘటనే అక్కినేని హీరో సుమంత్ కెరీర్‌లోనూ జరిగింది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సంచలన చిత్రం `దేశముదురు` కథ ముందుగా సుమంత్ దగ్గరకే వచ్చింది. అయితే ఈ కథను తాను వదులుకోవడంపైనా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపైనా సుమంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిలిం వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తనకి `దేశముదురు`కథ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా బహుశా నేను చేసి ఉంటే అంతగా ఆడేది కాదేమో! అది కేవలం అల్లు అర్జున్ చేస్తేనే ఆ స్థాయిలో ఆడుతుంది! అని సుమంత్ చాలా నిజాయితీగా.. నవ్వుతూ చెప్పారు. తన బలాలు, పరిమితులపై సుమంత్‌కి ఉన్న అవగాహనను ఈ సమాధానం స్పష్టం చేస్తోంది.

సాధారణంగా సుమంత్ పర్సనాలిటీ చాలా క్లాస్‌గా, సెన్సిటివ్‌గా ఉంటుంది. మరి అలాంటి హీరో `దేశముదురు` లాంటి పూర్తిస్థాయి మాస్ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేదేమో అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఎలాంటి హీరోనైనా తనదైన శైలిలో మాసీగా ఎలివేట్ చేయగల దిట్ట. అయితే అల్లు అర్జున్‌లోని ప్రత్యేకమైన ఎనర్జీ, డ్యాన్స్‌లు, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు ప్రాణం పోశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదే సమయంలో తన త‌దుప‌రి చిత్రం `న్యూటన్స్ థర్డ్ లా` ప్రమోషన్ల గురించి అడిగిన ప్రశ్నకు కూడా సుమంత్ అంతే వేగంగా.. బ్యాలెన్స్‌డ్‌గా సమాధానమిచ్చారు. ప్రమోషన్లలో అతిగా స్టేట్‌మెంట్లు ఇవ్వడం సినిమాపై భారం (బర్డెన్) కాదా అని జర్నలిస్ట్ అడగ్గా.. ``నేను ఎప్పుడూ కొంచెం మోడరేట్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడే రకాన్ని. కానీ మా దర్శకుడు రాజేష్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు.. కొందరు తమ నమ్మకాన్ని బయటకు బిగ్గరగా చెప్తారు`` అని వివరించారు.

ఏది ఏమైనా... సినీ పరిశ్రమలో సక్సెస్ సాధించడం ఎంత ముఖ్యమో... ఇతరుల ప్రతిభను గుర్తించి గౌరవించడం కూడా అంతే ముఖ్యం. `దేశముదురు` విజయంలో అల్లు అర్జున్ కష్టాన్ని, ఎనర్జీని మనస్ఫూర్తిగా అంగీకరించిన సుమంత్ నిజాయితీ ప్రశంసనీయం. తన స్వభావాన్ని కాపాడుకుంటూనే... తోటి కళాకారులను, దర్శకుల ఉత్సాహాన్ని గౌరవించే సుమంత్ ఆలోచనా విధానం నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. న్యూట‌న్స్ థ‌ర్డ్ లా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. సుమంత్ కి న‌టుడిగా మంచి పేరొస్తుంద‌ని కూడా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.