దేవరకొండ డిక్షన్‌తో ఆకట్టుకుంటున్న మరో యంగ్ హీరో!
తెలుగు చిత్రసీమలో నైజాం యాస, మాండలికంతో పాటు సూటితనంతో మాట్లాడే హీరోలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
By: Sivaji Kontham | 26 Aug 2026 11:00 PM ISTతెలుగు చిత్రసీమలో నైజాం యాస, మాండలికంతో పాటు సూటితనంతో మాట్లాడే హీరోలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలు తమ సహజమైన మాటతీరుతో వేదికలపై ఎటువంటి బెదురు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడే శైలితో కుర్రకారును ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన `రోమాంచకం` చిత్ర కార్యక్రమాల్లో అతడు మాట్లాడిన తీరును చూసిన సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు అతడిని విజయ్ దేవరకొండ మాటతీరుతో పోలుస్తూ కితాబిస్తున్నారు.
ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అతడి సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కలసి `భద్రకాళి పిక్చర్స్` పతాకంపై నిర్మించిన చిత్రం `రోమాంచకం`. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేదికగా సుమంత్ ప్రభాస్ మాట్లాడిన మాటలు.. అతడి కాన్ఫిడెన్స్ ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో నాన్‌స్టాప్ ఫన్ అండ్ క్యూట్ లవ్ స్టోరీతో రూపుదిద్దుకున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుందని సందీప్ వంగా ధీమా వ్యక్తం చేశారు. వేదికపై సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ... వంగా బ్రదర్స్‌ను ``మా పెద్దమ్మ కొడుకుల్లా అనిపిస్తారు అన్న`` అని సంబోధిస్తూ తన ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.
సందీప్ వంగా, ప్రణయ్ వంగా వంటి బిజీ ప్రొడ్యూసర్లు ఒక యంగ్ హీరోను తమ సొంత తమ్ముడిలా ప్రోత్సహించడం సుమంత్ ప్రభాస్ కెరీర్‌కు ఎంతో ప్లస్ కానుంది. ఈ ఈవెంట్‌లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. భద్రకాళి బ్యానర్‌లో ట్రావెల్ అవుతున్నప్పుడు తెలిసింది సందీప్ అన్న, ప్రణయ్ అన్న ఎంత మంచి మనసున్న వాళ్లో.. నన్ను ఓపెన్ అప్ చేసి నవ్వించే మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు వేణు అన్నకు... అలాగే తోటి నటీనటులైన అనంతిక, సోహన్, వెంకటేష్, నరేంద్రలకు నా కృతజ్ఞతలు అని తెలిపాడు. ట్రైలర్ మీ అందరికీ నచ్చితేనే థియేటర్లకు రండి అంటూ అతడు వ్యక్తం చేసిన కాన్ఫిడెన్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
తెలంగాణ నేటివిటీ నైజాం డిక్షన్ అనేది సంఘంలోనే కాదు.. థియేటర్లలోనూ ప్రత్యేకాకర్షణగా ప్రతిధ్వనిస్తుంది. గతంలో `మేమ్‌ఫేమస్` సినిమాతో తనలోని ప్రతిభను చాటుకున్న సుమంత్ ప్రభాస్, ఇప్పుడు `రోమాంచకం`లో మరింత ఈజ్‌తో కనిపించనున్నాడు. అనుకోకుండానే అతడి మాటతీరు దేవరకొండ, విశ్వక్ సేన్ శైలిని తలపిస్తుండటంతో అతడు కూడా అదే స్థాయిలో మాస్ అండ్ యూత్ ఆడియెన్స్‌కు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. తన పేరుకు తగ్గట్లే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు అభిమాని అయిన ఈ యంగ్ హీరో.. పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనదైన స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఏదేమైనా ఒక కథానాయకుడి విజయం అనేది కేవలం మాటతీరుపైనే కాకుండా అతడు ఎంచుకునే కథలు, దర్శకుడు, నిర్మాతలు .. నటనలోని వైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా లాంటి విజన్ ఉన్న మేకర్స్ తోడ్పాటుతో పాటు వినోదాత్మక కథతో వస్తున్న సుమంత్ ప్రభాస్‌కి ఈ `రోమాంచకం` చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేవరకొండ శైలిలో ఫ్లోతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో భవిష్యత్తులో ఎలాంటి విజయాలను అందుకోనున్నాడో వేచి చూడాలి. రోమాంచకం చిత్రం సెప్టెంబర్ 3న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తోంది.
