'రోమాంచకం' ట్రైలర్.. ఎలా ఉందంటే..
‘మేమ్ ఫేమస్’ తర్వాత సుమంత్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు.
By: M Prashanth | 25 Aug 2026 10:15 PM IST‘మేమ్ ఫేమస్’ తర్వాత సుమంత్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు. సెప్టెంబర్ 3న రిలీజ్ ఉండటంతో ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. డేటింగ్ యాప్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే సరదా లవ్ ట్రాక్ లాగా కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
సుమంత్ ఇందులో ఒక డేటింగ్ స్టార్టప్ నడిపే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అబ్బాయిలు, అమ్మాయిలను కలిపే తన బిజినెస్ గురించి ఇంట్లో తండ్రికి వివరించే సీన్‌తోనే అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో చూపించారు. అదే పనిలో అనంతిక సనిల్‌కుమార్ పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమ వరకు వెళ్లడం ట్రైలర్‌లో కనిపిస్తోంది. డేటింగ్ యాప్ అనే పాయింట్‌ను పెట్టినా కథను మాత్రం పూర్తిగా దాని చుట్టూనే తిప్పినట్లు లేదు.
హీరోయిన్ పెట్టే ఫ్రెండ్‌షిప్ టెస్టులు, ఇద్దరి మధ్య జరిగే చిన్న గొడవలు, ఫ్రెండ్స్‌తో హీరో చేసే రచ్చతో ఫస్ట్ హాఫ్ టోన్ ఎలా ఉండొచ్చో ఒక ఐడియా ఇచ్చారు. “ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి?” అనే ప్రశ్నకు ‘రోమాంచకం’ అంటూ టైటిల్‌ను కూడా కథలోనే తీసుకొచ్చారు. సుమంత్ ప్రభాస్‌కు గ్యాంగ్ కూడా తోడవడంతో ఫ్రెండ్స్ కామెడీకి మంచి స్పేస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే ప్రేమ మొదలైనంత ఈజీగా ముందుకు వెళ్లదు అని మరో లేయర్ చూపించారు. అనంతిక అతన్ని ఫోన్, వాట్సాప్‌లో బ్లాక్ చేయడం, తర్వాత ఆమె కుటుంబం పోలీస్ కేసు వరకు వెళ్లడంతో కథ మరో వైపు తిరుగుతుంది. హీరో చేసిన పని కారణంగా అతని ఫ్రెండ్స్ కూడా పోలీస్ స్టేషన్‌కు చేరడం నుంచి ట్రైలర్‌లో అసలు కామెడీ ఎక్కువగా వచ్చింది. లాకప్‌లో సుమంత్ స్నేహితుల మధ్య వచ్చే కౌంటర్స్ కూడా అదే టోన్‌లో ఉన్నాయి.
సుమంత్ ప్రభాస్‌కు ఇది ‘మేమ్ ఫేమస్’ తర్వాత మరో యూత్ సినిమా. కానీ ఈసారి దర్శకత్వం, రైటింగ్ బాధ్యతలు అతని మీద లేవు. వేణుగోపాల్ రెడ్డికి ఇదే తొలి సినిమా కాగా, వాసుకి వైభవ్ సంగీతం అందించాడు. ప్రేమ, కామెడీతో పాటు మధ్యలో సస్పెన్స్ కూడా ఉంటుందని టీమ్ ముందే చెబుతోంది. ఫస్ట్ కాపీ చూసిన సందీప్ రెడ్డి వంగా కూడా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించినట్లు సుమంత్ ఇటీవల చెప్పాడు.
సెప్టెంబర్ 3 రిలీజ్‌కు ముందు ‘రోమాంచకం’ ఏ రూట్‌లో వెళ్లబోతోందో ట్రైలర్‌తో మాత్రం క్లారిటీ వచ్చింది. సందీప్ వంగా పేరు ముందు కనిపించినా, ట్రైలర్‌లో ఆయన సినిమాల తరహా ఇంటెన్సిటీ కోసం వెళ్లలేదు. సుమంత్ ప్రభాస్‌కు సెట్ అయ్యే యూత్ కామెడీ, లవ్ ట్రాక్‌ను ముందుకు పెట్టారు. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్ నుంచి మొదలైన గందరగోళం రెండు గంటల సినిమాలో ఎంత వరకు నవ్విస్తుంధో చూడాలి.
