ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా షూటింగ్.. సుమంత్ ప్రభాస్ 'రోమాంచకం' ముచ్చట్లు!
సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 'రోమాంచకం' సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
By: M Prashanth | 21 Aug 2026 8:20 PM ISTసెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 'రోమాంచకం' సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. లేటెస్ట్ గా జరిగిన ప్రెస్‌మీట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ తన స్పీచ్‌తో అందరినీ ఎట్రాక్ట్ చేశాడు. భద్రకాళి పిక్చర్స్ లాంటి డ్రీమ్ బ్యానర్‌లో అవకాశం రావడం పట్ల నిజంగా హ్యాపీగా ఉందని వివరణ ఇస్తూ మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎవరికీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా చాలా సీక్రెట్‌గా ఉంచామని చెప్పాడు. ఇక మద్యలో ప్రణయ్ వంగా వచ్చి అసలు విషయం చెప్పారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ స్పిరిట్ అప్‌డేట్స్ ఇవ్వడం లేదని అంటారని, ఆ ట్రోల్స్ నుంచి తప్పించుకోవడానికే డైరెక్టర్ ఇలా ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. ఏకంగా షూటింగ్ మొత్తం అయిపోయాకే తాము ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశామని తెలిపారు .
ఇక ఆ తరువాత సుమంత్ మాట్లాడుతూ.. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా నమ్మశక్యంగా అనిపించలేదని సరదాగా అన్నాడు. ఈ సినిమా తన దగ్గరకు ఎలా వచ్చిందో కూడా సుమంత్ వివరించాడు. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో ఉన్నప్పుడు సందీప్ అన్న ఒక 'ఖతర్నాక్' కథ ఉందని, వింటావా అని అడిగారని చెప్పాడు. ఆ మాట వినగానే ఎగ్జైట్ అయిన తాను, మరుసటి రోజే ఇండియాకు తిరిగి వచ్చి వెంటనే కథ విన్నానని గుర్తుచేసుకున్నాడు.
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తనకు దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కథను నెరేట్ చేశారని సుమంత్ చెప్పాడు. కేవలం నెరేషన్ దగ్గరే ఆగిపోకుండా, పేపర్ మీద ఏముందో దాన్ని వంద శాతం పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడని దర్శకుడి పనితనం మీద పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో తన లుక్ గురించి చెబుతూ.. మునుపటి సినిమాల్లో తాను ఎక్కువగా పల్లెటూరి కుర్రాడిలా కనిపించానని సుమంత్ అన్నాడు. కానీ ఈ చిత్రంలో పక్కా అర్బన్ సిటీ బాయ్ లాగా ప్రెజెంట్ చేశారని, తన బాడీ లాంగ్వేజ్ నుంచి మాట తీరు వరకు పూర్తిగా మార్చేశారని చెప్పాడు.
తనను ఇంత కొత్తగా చూపించినందుకు టీమ్‌కు థాంక్స్ చెప్పిన సుమంత్, హీరోయిన్ అనంతికతో పాటు మిగతా నటీనటులు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని మెచ్చుకున్నాడు. చివరగా 'రోమాంచకం' టైటిల్ గురించి మాట్లాడుతూ, మొదట్లో ఆ పదం తనకు చాలా కొత్తగా అనిపించిందని అన్నాడు. దానికి గూస్ బంప్స్, ఎగ్జైట్మెంట్ అనే అర్థం ఉందని, ఈ టైటిల్ ఫిక్స్ చేయగానే షాక్ అయ్యానని చెప్పాడు. సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పదం జనాలకు బాగా అలవాటైపోతుందని, అందరూ వాడుకునే మూత పదంలా మారుతుందని సుమంత్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.
