Begin typing your search above and press return to search.

మ‌నం చూడ‌లేదు..కారణం తెలిస్తే గుండె బరువెక్కాల్సిందే!

అక్కినేని ఫ్యామిలీలోని మూడు త‌రాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి కనిపించిన మనం సినిమాను ఆడియ‌న్స్ ఒక అరుదైన ఫ్యామిలీ మూవీగా గుర్తుపెట్టుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Sept 2026 1:09 PM IST
మ‌నం చూడ‌లేదు..కారణం తెలిస్తే గుండె బరువెక్కాల్సిందే!
X

సినిమా అంటే ప్రేక్షకులకు ఒక కథ. కొందరికి అది ఎంట‌ర్టైన్‌మెంట్. మరికొందరికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. కానీ ఒకే సినిమా ఒక కుటుంబ సభ్యుడికి మాత్రం తెరపై కనిపించే కథ కంటే, తన మనసులో చెరగని ముద్ర వేసిన ప‌ర్స‌న‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంద‌నేది అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా విషయంలో సుమంత్ అనుభవం గుర్తుచేస్తోంది.

అక్కినేని ఫ్యామిలీలోని మూడు త‌రాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి కనిపించిన మనం సినిమాను ఆడియ‌న్స్ ఒక అరుదైన ఫ్యామిలీ మూవీగా గుర్తుపెట్టుకున్నారు. మూడు తరాల అక్కినేని హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించడం, ఏఎన్నార్‌ నటించిన ఆఖ‌రి సినిమా కావడం ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అయితే అదే ప్రత్యేకత సుమంత్‌కు మాత్రం మరో విధమైన భావనను కలిగిస్తోంది. ప్రేక్షకుడిగా ఆ సినిమాను ఆస్వాదించాల్సిన చోట, ఫ్యామిలీ మెంబ‌ర్ గా ఆయనకు స్క్రీన్ పై ఎన్నో జ్ఞాప‌కాలు క‌నిపించ‌డంతో అస‌లు ఆ సినిమాను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేక‌పోయాన‌ని రీసెంట్ గా ఓ సంద‌ర్భంగా సుమంత్ వెల్ల‌డించారు.

ఏఎన్నార్ లైఫ్ లోని చివరి దశను దగ్గరగా చూసిన వ్యక్తుల్లో సుమంత్‌ కూడా ఒకరు. అందుకే మనం సినిమాను చూసే ప్రయత్నం చేసిన ప్రతిసారీ సినిమాలోని సీన్స్ కంటే, ఆ టైమ్ లో తన తాత ఎదుర్కొన్న పరిస్థితులే గుర్తుకొస్తాయని ఆయన చెప్పిన మాటలు అంద‌రి గుండెల్ని తాకుతున్నాయి. ఏఎన్నార్ లాంటి గొప్ప నటుడి ఆఖ‌రి సినిమా కావడం ఆడియ‌న్స్ కు ఎమోష‌న్ గా అనిపించవచ్చు. కానీ ఆ నటుడి ఆఖ‌రి రోజుల్ని దగ్గరగా చూసిన మనవడికి మాత్రం అదే సినిమా వ్యక్తిగత వేదనను మళ్లీ గుర్తు చేసే అనుభూతిగా మారుతుంది.

ఒక వ్యక్తిని ఎంతగానో ప్రేమించినప్పుడు, ఆయనతో ముడిపడిన కొన్ని జ్ఞాపకాలను తిరిగి ఎదుర్కోవడం ఎంత కష్టమో ఈ సంఘటన చెబుతోంది. మనంలో ఏఎన్నార్‌ కనిపించడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తే, సుమంత్‌కు మాత్రం ఆ స్క్రీన్‌పై కనిపించే రూపం వెనుక తన తాతను చూసిన చివరి రోజుల జ్ఞాపకం దాగి ఉంది. అందుకే మనం సినిమాను సుమంత్‌ ఇప్పటివరకు పూర్తిగా చూడలేకపోవడం ఆశ్చర్యంగా కనిపించినా, దాని వెనుక ఉన్న రీజ‌న్ మాత్రం అత‌ని బాధ‌ను తెలియ‌జేస్తోంది. కొన్ని సినిమాలను మనం ఎప్పుడైనా చూడొచ్చు. కానీ కొన్ని జ్ఞాపకాలను మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఫేస్ చేయ‌డానికి మ‌న‌సు సిద్ధంగా ఉండదు. సుమంత్‌ విషయంలో మనం సినిమా కూడా అలాంటి సినిమాగానే మిగిలిపోయింది.