Begin typing your search above and press return to search.

'విశ్వనాథ్‌ అండ్ సన్స్' లాంటి సినిమా చేయాలని ఉంది: సుమంత్

అక్కినేని మనుమడు, నటుడు సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `మహేంద్రగిరి వారాహి`.

By:  Sivaji Kontham   |   28 Aug 2026 10:50 PM IST
విశ్వనాథ్‌ అండ్ సన్స్ లాంటి సినిమా చేయాలని ఉంది: సుమంత్
X

అక్కినేని మనుమడు, నటుడు సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `మహేంద్రగిరి వారాహి`. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సుమంత్ సినిమా విశేషాలతో పాటు.. తన మనసులోని మాటలను పంచుకుంటూ వెంకీ అట్లూరి `విశ్వనాథ్ అండ్ సన్స్` వంటి అద్భుతమైన సినిమా చేయాలని ఉందనే తన కోరికను బయటపెట్టారు.

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. `మహేంద్రగిరి వారాహి` టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించిందని.. అది చాలా సహజంగా వైరల్ అయిందని చెప్పారు. టీజర్ సాధించిన ఆదరణ కంటే ఈ ట్రైలర్ పది రెట్లు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సంతోష్‌తో `సుబ్రహ్మణ్యపురం` తర్వాత ఇది తనకు రెండో సినిమా అని.. దాదాపు మూడేళ్లుగా ఈ కథపై పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు మధు గారు, లక్ష్మణ్ గారు నిర్మాతలుగా ముందుకు వచ్చి స్తంభాల్లా అండగా నిలబడ్డారని ప్రశంసించారు.

వేడుకకు విచ్చేసిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి గురించి సుమంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను ఇటీవల వెంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ చిత్రంలో ఒక సపోర్టింగ్ రోల్ చేశానని గుర్తుచేసుకున్నారు. వెంకి తెర‌కెక్కించిన‌ సినిమాలన్నింటిలో `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రం తనకెంతో ఇష్టమైనదని... గత పదేళ్లలో తాను చూసిన టాప్-10 చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని కొనియాడారు. ముఖ్యంగా ఆ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే - రైటింగ్ ఒక టెక్స్ట్‌బుక్‌లా ఉంటుందని.. ఇప్పటికే రెండు సార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తోందని చెబుతూ.. తనకు కూడా అలాంటి మంచి కథాంశంతో కూడిన సినిమా చేయాలని ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక `మహేంద్రగిరి వారాహి` చిత్రంలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ.. స్టార్ హీరో, `డీజే టిల్లు` ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని సుమంత్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్రైలర్ ద్వారానే మొదటిసారిగా ప్రేక్షకులకు తెలియజేశామని.. సినిమాలో భాగమైనందుకు సిద్ధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధు పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సాధారణంగా తాను ఏ విషయానికైనా చాలా ప్రశాంతంగా- కామ్‌గా ఉంటానని.. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం తనకు ఒక బలమైన నమ్మకం ఉందని సుమంత్ చెప్పారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ `మహేంద్రగిరి వారాహి` చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త, చిరస్మరణీయమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో వెంకీ అట్లూరి స‌హా చిత్ర‌బృందం పాల్గొన్నారు.