Begin typing your search above and press return to search.

చిరంజీవి నన్ను తొక్కేయలేదు

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఉన్న పోటీ గురించి, అలాగే ఒకరు ఇంకొకరి కెరీర్ దెబ్బతీశారనే విషయాల గురించి ఎప్పుడూ ఏదో ఒక టాక్ వస్తూనే ఉంటుంది.

By:  M Prashanth   |   22 Aug 2026 7:00 PM IST
చిరంజీవి నన్ను తొక్కేయలేదు
X

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఉన్న పోటీ గురించి, అలాగే ఒకరు ఇంకొకరి కెరీర్ దెబ్బతీశారనే విషయాల గురించి ఎప్పుడూ ఏదో ఒక టాక్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాదనల్లో దశాబ్దాలుగా సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో ఎక్కువగా వినిపించే ఒక పుకారు ఉంది. అదే హీరో సుమన్ కెరీర్‌ను మెగాస్టార్ చిరంజీవి కావాలనే ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారనే వాదన.

అయితే సుమన్ ఈ పాత వివాదంపై పూర్తి స్థాయిలో స్పందిస్తూ, అప్పట్లో అసలు ఏం జరిగింది, ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందనే విషయాలను సూటిగా వివరించారు. చిరంజీవి తనను తొక్కేశారంటూ జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సుమన్ ఏమాత్రం తడబడకుండా తేల్చి చెప్పారు. ఆ మాటలు నూటికి నూరు శాతం అబద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు.

చిరంజీవి అలా చేశారని చెప్పడానికి ఎవరి దగ్గరైనా సరైన ఆధారాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తనకు తెలిసి మాత్రం తన కెరీర్ విషయంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని సుమన్ స్పష్టం చేశారు. చిరంజీవి లాంటి ఉన్నతమైన వ్యక్తి అంత కింది స్థాయికి దిగజారి పనులు చేయరని, తనకంటే కింద ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టే ఇలాంటి విధానాలను ఆయన ప్రోత్సహించరని సుమన్ చెప్పారు.

రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండే వాతావరణమే సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నప్పుడు, మూడో వ్యక్తి ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడని ఆయన వివరంగా చెప్పారు. ఒకరి మీద గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరి, ఆ నెపాన్ని కావాలనే రెండో వ్యక్తి మీద మోపి, వాళ్ల మధ్య గొడవలు పెట్టి ఆనందించే మూకలు చాలా ఉంటాయని, సరిగ్గా తన విషయంలో కూడా ఆ రోజుల్లో అదే జరిగిందని సుమన్ అసలు పాయింట్ బయటపెట్టారు.

తమ ఇద్దరి మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదని, కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదని సుమన్ పదే పదే గుర్తుచేశారు. ఆ రోజుల్లో తమ ఇద్దరి సినిమాల మధ్య ఎవరు యాక్షన్ సీన్స్ బాగా చేస్తున్నారు, ఎవరు స్క్రీన్ మీద మంచి డ్యాన్స్ వేస్తున్నారు, ఎవరు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అనే విషయాల్లో మాత్రమే కచ్చితమైన ప్రొఫెషనల్ పోటీ ఉండేదని ఆయన చెప్పారు.

ఆ పోటీ కేవలం కెమెరా ముందు వరకే పరిమితం అయిందని, దాన్ని బయటకు తీసుకువచ్చి ఒకరి అవకాశాలు మరొకరు లాక్కోవడం, తొక్కేసుకునేంత చెడ్డ ఆలోచనలు తమ ఇద్దరికీ ఎప్పుడూ రాలేదని ఆయన చాలా క్లారిటీగా జవాబు ఇచ్చారు.

ప్రత్యేకించి శిక్షణ తీసుకున్న కమల్ హాసన్ లాంటి వాళ్ల డ్యాన్స్ స్థాయి వేరే లెవెల్ లో ఉంటుందని, కానీ తనకూ చిరంజీవికి మధ్య ఉన్న డ్యాన్స్ పోటీ మాత్రం ప్రాక్టీస్ తో పాటు చాలా సహజంగా, హెల్తీగా సాగిందని ఆయన వివరించారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నానుతున్న ఒక వివాదాస్పదమైన పుకారుకు హీరో సుమన్ తన మాటలతో ఈ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టారు.