డ్యాన్సర్స్ వివాదం: అవినీతికి పాల్పడితే నిరూపించండి.. సుమలత కౌంటర్
అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 28 Sept 2026 10:17 AM ISTటాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు -నాయకుల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుని వివాదాలకు తెరలేపింది.
ఈ వివాదంలో ప్రధానంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ల వైఖరిపై సుమలత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్, అజయ్ సాయి మాస్టర్, సత్య మాస్టర్ వంటి ప్రముఖులు.. ఇతర సోకాల్డ్ మాస్టర్లు కొందరు వ్యక్తులను వెనుకేసుకువస్తూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని సుమలత (జానీ మాస్టార్ భార్య) బహిరంగంగా ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఎక్కడైనా తప్పు జరిగితే తాము ముందుండి ప్రశ్నిస్తామని..యూనియన్‌లో ఎవరి తప్పునైనా నిలదీస్తామని చెప్పే వీరు.. తమ వర్గానికి చెందిన వారి దగ్గర అవినీతి జరిగినప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
ఇక అసోసియేషన్‌లో నిధుల దుర్వినియోగం, మోసాలకు సంబంధించి కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ సభ్యులు 5 లక్షల వరకు మోసం చేశారని వచ్చిన ఆరోపణలపై హోస్ట్ ప్రశ్నించగా.. సుమలత దీనికి ఘాటుగా స్పందించారు. తాము ఏ ప్రశ్న అడిగినా తగిన ప్రూఫ్స్‌తోనే అడుగుతున్నామని.. అవసరమైతే పనుల నిమిత్తం తీసుకున్న డబ్బులకు సంబంధించిన పక్కా ఆధారాలు చూపగలమని ఆమె స్పష్టం చేశారు.
ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కొందరు ప్రముఖులు ఎందుకు నోరుమెదపడం లేదని సుమలత ఆశ్చర్యపోయారు. అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా కనీసం క్వశ్చన్ కూడా చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ మౌనం వెనుక ఉన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. అసోసియేషన్‌లోని లోపాలను ఎత్తిచూపారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న ఈ వర్గపోరు కేవలం వ్యక్తిగత విభేదాల వల్ల కాకుండా.. అధికార మార్పిడి, నిధుల నిర్వహణ.. యూనియన్ పై ఆధిపత్యం గుత్తాధిపత్యం కోసం జరుగుతున్న పోరుగా తెలుస్తోంది. సుమలత వర్గానికి, రఘు మాస్టర్ వర్గానికి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ కారణంగా అసోసియేషన్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు... అసోసియేషన్ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఎన్నికల కొత్త తేదీలను ఖరారు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
