యాంకర్ సుమకు 100 కోట్ల ఆస్తి.. ఏడాదికి సంపాదన ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న యాంకర్ సుమ కనకాల పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
By: Sivaji Kontham | 30 April 2026 8:15 AM ISTతెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న యాంకర్ సుమ కనకాల పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా - ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సుమ కేవలం ఒక యాంకర్‌గానే కాకుండా ఒక బ్రాండ్‌గా మారి భారీస్థాయిలో ఆస్తులను కూడగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఒక మలయాళీ అయి ఉండి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ స్థాయి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సుమ ఆదాయ మార్గాలను పరిశీలిస్తే..తనకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఒక్కో టీవీ ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు అందుకుంటున్న సుమ .. సినిమా ఈవెంట్ల (ప్రీ-రిలీజ్, ఆడియో లాంచ్) విషయానికి వస్తే రూ. 4 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. ఇక స్టార్ హీరోల ఇంటర్వ్యూలకైతే సుమారు రూ. 4 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. కేవలం హోస్టింగ్ ద్వారానే ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్న సుమ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రమోషనల్ వీడియోల ద్వారా ఒక్కో దానికి రూ. 5 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. వెరసి ఏడాదికి మొత్తం ఆదాయం రూ. 10 నుండి రూ. 12 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
సుమ కెరీర్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. 1996లో దాసరి నారాయణరావు `కళ్యాణ ప్రాప్తిరస్తు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు అసలైన గుర్తింపు మాత్రం బుల్లితెరపైనే లభించింది. స్వయంవరం, `అన్వేషిత`వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుమ ఆ తర్వాత యాంకరింగ్‌లోకి మారి తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. ఇదే క్రమంలో నటుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 1999లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అటు వృత్తిపరంగా..ఇటు వ్యక్తిగతంగా సుమ తనదైన ముద్ర వేశారు.
సుమ సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే తన అద్భుతమైన `సమయస్ఫూర్తి`. వేదికపై ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తన చమత్కారంతో అందరినీ నవ్వించగలగడం ఆమె ప్రత్యేకత. కేరళకు చెందిన యువతి అయినా.. అచ్చ తెలుగు ఆడపడచులా స్పష్టమైన భాషతో పాటు తెలుగు సంస్కృతిని, సామెతలను అలవోకగా వాడటంలో తనకు సాటిలేదు. ఎదుటివారిని నొప్పించకుండా సెటైర్లు వేయడం.. గంటల కొద్దీ సాగే ఈవెంట్‌ను తన మాటలతో బోర్ కొట్టకుండా నడిపించడంలో సుమ టైమింగ్ మరే యాంకర్‌కూ దక్కలేదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రదీప్, శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి ఎంతోమంది టాలెంటెడ్ యాంకర్లు ఉన్నా.. సుమ పారితోషికం - క్రేజ్ మాత్రం అగ్రస్థానంలోనే ఉన్నాయి. మిగిలిన యాంకర్లు ఒక్కో షోకు రూ. 1 నుండి రూ. 2 లక్షల మధ్య అందుకుంటుంటే.. సుమ రేంజ్ మాత్రం పది కోట్లకు పైగా వార్షిక ఆదాయంతో భిన్నంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడమే కాకుండా.. ఆదాయం పరంగా కూడా టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సుమ నిజంగానే బుల్లితెర `కుబేరురాలు` అంటే తప్పేమీ కాదు.
