రాజీవ్ మాటలకు ఏడ్చేసిన సుమ.. ఏం జరిగిందంటే?
తెలుగు స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సుమ కనకాల ఎంత పేరు సంపాదించుకున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదేమో
By: M Prashanth | 24 Oct 2026 7:04 PM ISTతెలుగు స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సుమ కనకాల ఎంత పేరు సంపాదించుకున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదేమో. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె.. మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. రీసెంట్ గా తన గురించి భర్త రాజీవ్ కనకాల చెప్పిన మాటలకు భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే..
సుమ కనకాల స్ట్రార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ సంస్థ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో హైదరాబాద్ లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. పండగలు చేసుకునే స్థోమత లేని వారికి కూడా ఆ హ్యాపీనెస్ ను ఇవ్వాలనే ఉద్దేశంతో సుమ ఆ ఈవెంట్ ను స్టార్ట్ చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు ఉండే ఆశ్రమాల్లో పండగలు నిర్వహిస్తూ తనవంతుగా సాయం చేస్తున్నారు. ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ఆ ఈవెంట్ లో సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల చేసిన కామెంట్స్ అందరినీ కదిలించాయి. తన భార్య గురించి చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సుమ జర్నీ నార్మల్ ది కాదని, తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా ఆమె ఎంతో పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఇంత బిజీగా ఉంటూనే ఇతరులకు సహాయం చేయడం ఆమె గొప్పతనమని చెప్పారు.
'సుమ జర్నీ మామూలు జర్నీ కాదు. తను ఇంత సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లడానికి ఆమెకున్న పట్టుదలే కారణం. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను ముందుకు తీసుకెళ్లడానికి కారణం నాలాంటి వాడిని భరించడమే' అంటూ రాజీవ్ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత సుమ సేవా కార్యక్రమాల గురించి చెబుతూ మరింత ఎమోషనవ్ అయ్యారు. ఆ సంస్థను ఐదేళ్ల క్రితం అధికారికంగా ప్రారంభించినప్పటికీ, అంతకంటే ముందే సుమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజీవ్ తెలిపారు.
ఆమెకు ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, సుమకు పెద్దగా సాయం చేయలేదని రాజీవ్ అన్నారు. తమను, తన చుట్టూ ఉన్నవారిని కూడా ఆమెనే ముందుకు నడిపించారని తెలిపారు. ఇతరులకు అండగా నిలవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. సుమ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాజీవ్ చెప్పారు. 'నువ్వు 116 ఏళ్లు బతుకుతావు. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
చివర్లో 'లవ్ యు' అంటూ భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. భర్త తన గురించి ఇంత ప్రేమగా మాట్లాడటంతో సుమ ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజీవ్ మాట్లాడిన తర్వాత వేదికపైకి వెళ్లి ఆయనను దగ్గరుండి తీసుకొచ్చారు. సాధారణంగా సినిమా వేడుకల్లో తన మాటలతో అందరినీ నవ్వించే సుమ.. ఈసారి భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది. రాజీవ్ ప్రశంసించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
