ఏ నటుడికైనా అసూయ.. ఎప్పుడూ చూడని జానర్.. సుక్కూ ప్రశంసలే ప్రశంసలు!
ఈ సినిమా స్పెషల్ షో వీక్షించిన తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, ఇందులో సత్యదేవ్ నటనను చూసి అసూయ చెందని నటుడు ఉండరని కితాబిచ్చారు.
By: Sivaji Kontham | 28 Jun 2026 2:34 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఒక నిజాయితీతో కూడుకున్న సరికొత్త ప్రయత్నాన్ని అభినందించేందుకు ఇక్కడి సినీ ప్రముఖులు ఎన్నడూ వెనకాడరు. అది పెద్ద సినిమానా లేదా చిన్న సినిమానా అనే వ్యత్యాసం లేకుండా.. కంటెంట్‌లో దమ్ముంటే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా టాలీవుడ్‌లో ఇలాంటి ప్రశంసలే అందుకుంటోంది సత్యదేవ్ నటించిన `రావ్ బహదూర్` చిత్రం. ఈ సినిమాను వీక్షించిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు అందిస్తున్న ప్రశంసలు చూస్తుంటే.. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతుందనే నమ్మకం కలుగుతోంది.
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించారు కాబట్టి ఆ రకంగా మాట్లాడి ఉండవచ్చని కొందరు భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేని, `పుష్ప` ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ ప్రివ్యూ చూసి చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తేశారు. సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఒక సినిమాను ఇంతలా ప్రశంసించారంటే కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
ఈ సినిమా స్పెషల్ షో వీక్షించిన తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, ఇందులో సత్యదేవ్ నటనను చూసి అసూయ చెందని నటుడు ఉండరని కితాబిచ్చారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ క్యారెక్టర్‌ను చూసి ఈర్ష్య పడతారని, అంత అద్భుతంగా ఈ పాత్రను తీర్చిదిద్దారని అన్నారు. ఏ నటుడికైనా తన కెరీర్‌లో ఇలాంటి ఒక అద్భుతమైన పాత్ర దక్కడం అనేది ఒక గొప్ప వరమని, సత్యదేవ్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అసాధారణ నటనను కనబరిచారని సుకుమార్ కొనియాడారు.
దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని అత్యంత వినూత్నంగా... అద్భుతమైన విజన్‌తో రూపొందించారని సుకుమార్ తెలిపారు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా.. అసలు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇప్పటివరకు ఇలాంటి భిన్నమైన జానర్ సినిమా రాలేదని ఆయన పొగడటం విశేషం. ఈ సినిమా కోసం నిపుణులు సృష్టించిన ప్రపంచం (వరల్డ్-బిల్డింగ్), అందమైన కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడి ప్రతిభ ఈ సినిమాలో వేరే లెవెల్‌లో కనిపించిందని, సినిమాను చూస్తున్నంత సేపు ఒక సరికొత్త అనుభూతి కలిగిందని సుకుమార్ వివరించారు.
దర్శకుడి వినూత్న ఆలోచనలను నమ్మి, దానికి తగ్గట్టుగా ఈ వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించడానికి కేవలం టేస్ట్ ఉంటే సరిపోదని.. సినిమాపై నిజమైన ప్రేమ ఉండాలని ఈ సందర్భంగా సుకుమార్ పేర్కొన్నారు. దర్శకుడు వెంకటేష్ మహా విజన్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన నిర్మాత అనురాగ్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వెంకటేష్ మహాకు అనురాగ్ లాంటి నిర్మాత దొరకడం ఒక అదృష్టమని చెబుతూ... సుక్కూ కురిపించిన ఈ ప్రశంసల జల్లుతో `రావ్ బహదూర్` చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
