Begin typing your search above and press return to search.

DSP లేకుండా సుక్కూ మ్యాజిక్ క్రియేట్ చేయగలరా?

సుకుమార్ మూవీ అంటే స్టోరీ ఎంత స్పెషలో, మ్యూజిక్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది.

By:  M Prashanth   |   9 July 2026 11:17 AM IST
DSP లేకుండా సుక్కూ మ్యాజిక్ క్రియేట్ చేయగలరా?
X

సుకుమార్ మూవీ అంటే స్టోరీ ఎంత స్పెషలో, మ్యూజిక్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. ముఖ్యంగా సుకుమార్- సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్యతో మొదలైన ఆ జర్నీ పుష్ప 2 వరకు కొనసాగింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌ కు బ్రేక్ పడుతుందనే ప్రచారం హాట్ టాపిక్‌ గా మారింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC17 చిత్రానికి దేవిశ్రీ వర్క్ చేయకపోవచ్చనే వార్తలు కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

చరణ్, సుక్కూ కాంబోలో రంగస్థలం తర్వాత మరో సినిమా రానుండటంతో ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి మూవీకి దేవిశ్రీ వర్క్ చేయకపోవచ్చేనే ప్రచారం మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ నెట్టింట మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దాని వెనుక పుష్ప 2 సమయంలో జరిగిన పరిణామాలే కారణమని ప్రచారం జరుగుతోంది.

ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ పనుల్లో కొన్ని క్రియేటివ్ డిఫెరెన్స్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. దీంతో కొన్ని సీన్స్ కు ఇతర సంగీత దర్శకుల సహాయం తీసుకున్నారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. అదే ఎఫెక్ట్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టుపై పడిందేమోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దేవిశ్రీ బదులు ఎవరిని తీసుకుంటారన్నదే ఇప్పుడు మరో చర్చ. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌ దేవ్‌ తో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్, సాయి అభ్యంకర్ పేర్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు అనిరుధ్ రవిచందర్ పేరు అభిమానుల చర్చల్లో కనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో మ్యూజిక్ కు మరింత ఇంపార్టెన్స్ పెరిగిన నేపథ్యంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సుకుమార్- దేవిశ్రీ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఎన్నో మ్యూజికల్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాల్లో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

ముఖ్యంగా పుష్ప సిరీస్ పాటలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించాయి. అయితే సినిమా విజయంలో సంగీత దర్శకుడు ఒక్కరే కాదు, దర్శకుడి విజన్ కూడా కీలకమనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. కొత్త సంగీత దర్శకుడు వస్తే కొత్త శైలి, కొత్త సౌండ్ ప్రేక్షకులకు అందే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో దేవిశ్రీ ప్లేస్ ను భర్తీ చేయడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, దేవిశ్రీ ప్రసాద్ ప్రాజెక్టులో ఉంటారా? లేక కొత్త సంగీత దర్శకుడితో సుకుమార్ మ్యాజిక్ చూపిస్తారా? అన్న క్వశ్చన్ కు ఆన్సర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రంగస్థలం రేంజ్ లో మరో మ్యూజికల్ మ్యాజిక్‌ ను సుకుమార్ సృష్టించగలరా? లేదా కొత్త కాంబోతో న్యూ ట్రెండ్‌ స్టార్ట్ చేస్తారా? అనేది అంతా వేచి చూడాలి.