Begin typing your search above and press return to search.

272 మందిలో 14 మందికే ఛాన్స్.. అందులో సుకుమార్ కూతురు

ఆ 14 మందిలో సుకృతి కూడా చోటు దక్కించుకుంది. అంతేకాదు సింగర్స్ విభాగంలో పూర్తి స్కాలర్‌షిప్ పొందిన ఏకైక విద్యార్థినిగా నిలవడం మరింత ప్రత్యేకంగా మారింది.

By:  M Prashanth   |   13 Aug 2026 2:10 PM IST
272 మందిలో 14 మందికే ఛాన్స్.. అందులో సుకుమార్ కూతురు
X

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తండ్రికి తగ్గట్టుగా తన క్రేజ్ ను పెంచుకుంటోంది. అయితే ఈసారి సినిమా వల్ల కాదు, సంగీతంలో దక్కిన అరుదైన అవకాశంతో హైలెట్ అవుతోంది. ఒక స్కాలర్‌షిప్ కోసం 272 మంది ఆడిషన్ ఇస్తే అందులో కేవలం 14 మందినే ఎంపిక చేశారు. ఆ 14 మందిలో సుకృతి కూడా చోటు దక్కించుకుంది. అంతేకాదు సింగర్స్ విభాగంలో పూర్తి స్కాలర్‌షిప్ పొందిన ఏకైక విద్యార్థినిగా నిలవడం మరింత ప్రత్యేకంగా మారింది.




అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న బర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో వచ్చే ఏడాది జరగనున్న సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం సుకృతికి ఈ అవకాశం వచ్చింది. సంగీత విభాగంలో ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డుకు ఎంపిక కావడంతో పాటు పూర్తి స్కాలర్‌షిప్ కూడా ఆమె సొంతం చేసుకుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోటీ పడిన ఆడిషన్స్‌లో ఈ స్థాయి ఎంపిక సాధించడం సుకృతి సంగీత ప్రయాణంలో మంచి చాన్స్ అని చెప్పొచ్చు.

సుకృతి పేరు ఇలా వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా అవార్డు దక్కింది. చిన్న వయసులోనే నటనలో జాతీయ స్థాయి గుర్తింపు అందుకున్న ఆమె ఇప్పుడు సంగీతంలో కూడా తన ప్రతిభను చూపించే అవకాశం పొందింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుకృతి ఒక్క నటనకే పరిమితం కావడం లేదు. సినిమాతో వచ్చిన గుర్తింపు ఒక వైపు ఉంటే, మరోవైపు సంగీతంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. బర్క్‌లీ లాంటి మ్యూజిక్ సంస్థలో సమ్మర్ ప్రోగ్రామ్‌కు పూర్తి స్కాలర్‌షిప్ రావడం వల్ల ఆమెకు సంగీతాన్ని మరింత నేర్చుకునే అవకాశం దక్కనుంది.

ఇక సుకుమార్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా కూడా అవార్డు అందుకున్నారు. తండ్రి దర్శకత్వంలో తనదైన స్థాయిలో కొనసాగుతుంటే, సుకృతి మాత్రం నటనతో పాటు సంగీతంలో కూడా తనకంటూ మరో దారి వెతుక్కుంటోంది. ఇక భవిష్యత్తులో ఆమె నటనపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందా, సంగీతాన్ని ప్రధానంగా తీసుకుంటుందా అనేది చూడాలి.