డాక్యుమెంటరీని ఆపాలంటూ నెట్‌ఫ్లిక్స్ కి సుకేష్ చంద్రశేఖర్ కోర్టు నోటీసులు
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని నిలిపివేయాలని అతడి తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్, ఇండియా టుడే గ్రూప్‌కు లీగల్ నోటీసులు పంపి 72 గంటల్లో స్పందించాలని కోరారు. కేసు విచారణ పూర్తికాకముందే డాక్యుమెంటరీ విడుదల చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
By: Sivaji Kontham | 27 Nov 2026 9:00 PM IST200 కోట్ల మనీలాండరింగ్, దోపిడీ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జీవిత కథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన `లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ` డాక్యుమెంటరీ విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడింది. డిసెంబర్ 18న ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన వెంటనే నిందితుడైన సుకేశ్ తరపు న్యాయవాది అనంత్ మాలిక్ (అనంతం లీగల్) నెట్‌ఫ్లిక్స్ సంస్థతో పాటు ఇండియా టుడే గ్రూప్, డాక్యుమెంటరీ దర్శకులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు లీగల్ నోటీసులు పంపారు. తమ నోటీసుపై 72 గంటల్లోగా స్పందించాలని అల్టిమేటం జారీ చేస్తూ..ప్రస్తుతానికి ఈ డాక్యుమెంటరీ విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
200 కోట్ల దోపిడీ కేసు.. తీహార్ జైలులో జరిగినట్లు చెబుతున్న ఘటనలపై ఇంకా న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోందని.. సాక్షుల విచారణ పూర్తికాకముందే ఇలా ఏకపక్ష కథనంతో డాక్యుమెంటరీని విడుదల చేయడం వల్ల కేసు విచారణపై ప్రభావం పడుతుందని సుకేశ్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం సుకేశ్‌ను సంప్రదించలేదని.. అతడి అనుమతి తీసుకోలేదని నోటీసులో పేర్కొన్నారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులేనని గుర్తు చేస్తూ.. ప్రచార సామగ్రిలో సుకేశ్‌ను `కాన్మేన్` అని సంబోధించడాన్ని.. ఆరోపణలను నిజాలుగా చిత్రీకరించడాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషన్ సాక్ష్యాల నమోదు పూర్తయ్యే వరకు ఈ డాక్యుమెంటరీని.. దాని ట్రైలర్లు - ప్రమోషనల్ క్లిప్‌లను వెబ్ లోకి వెళ్లకుండా వాయిదా వేయాలని సుకేశ్ లీగల్ టీమ్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. విడుదలకు ముందే తమ న్యాయవాదులకు డాక్యుమెంటరీని ప్రదర్శించాలని.. ఇందులో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల వివరాలు వెల్లడించాలని.. అలాగే అన్ని ఫుటేజీలు, స్క్రిప్ట్‌లను భద్రపరచాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా వినతిపత్రం సమర్పించామని.. విడుదలపై స్టే కోరుతూ త్వరలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు అడ్వకేట్ అనంత్ మాలిక్ తెలిపారు.
``నెట్‌ఫ్లిక్స్ వేచి ఉండగలదు.. కానీ న్యాయమైన విచారణ వేచి ఉండలేదు. కోర్టు తీర్పు ఇవ్వకముందే మీరు తీర్పును స్ట్రీమ్ చేయలేరు. ఇది ఎవరి నోరు నొక్కే ప్రయత్నం కాదు.. కేవలం సమయానికి సంబంధించిన అంశం మాత్రమే. సినిమా కొన్ని నెలలు ఆలస్యంగా విడుదలైనా నష్టమేమీ లేదు... కానీ విచారణను మళ్లీ మొదటి నుంచి నిర్వహించలేం!`` అంటూ సుకేశ్ తరపు న్యాయవాది ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి ఈ లీగల్ నోటీసులపై నెట్‌ఫ్లిక్స్- ఇండియా టుడే గ్రూప్ ఏ విధంగా స్పందిస్తాయో... అనుకున్నట్లే డిసెంబర్ 18న ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి.
