Begin typing your search above and press return to search.

200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్

రూ.200 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ కథతో నెట్‌ఫ్లిక్స్ ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుఖేష్ చంద్రశేఖర్ స్టోరీ’ డాక్యుమెంటరీని రూపొందించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీతో అతడికి ఉన్న సంబంధాలు, తీహార్ జైలు నుంచే నేరాలు సాగించిన తీరు ఇందులో చూపించనున్నారు. డిసెంబర్ 18న ఇది స్ట్రీమింగ్ కానుంది.

By:  Sivaji Kontham   |   26 Nov 2026 11:11 PM IST
200 కోట్ల గ్యాంబ్ల‌ర్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్‌పై నెట్ ఫ్లిక్స్ డాక్యు సిరీస్
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 200 కోట్ల లూటీ స్కామ్ మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ చీకటి సామ్రాజ్యంపై ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక ఆసక్తికరమైన క్రైమ్ డాక్యుమెంటరీని ప్రకటించింది. `లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుఖేష్ చంద్రశేఖర్ స్టోరీ` పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది. గతంలో `కర్రీ & సైనైడ్`, `ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ` వంటి సంచలన డాక్యుమెంటరీలను అందించిన `ఇండియా టుడే ఒరిజినల్స్` సంస్థ దీనిని నిర్మించింది.




బెంగళూరులో ఒక సాధారణ యువకుడిగా మొదలైన సుఖేష్ ప్రస్థానం... దేశంలోని అత్యంత హై-ప్రొఫైల్ నేర దర్యాప్తులలో ప్రధాన నిందితుడిగా మారే వరకు సాగిన క్రమాన్ని ఇందులో డీటెయిల్డ్ గా విశ్లేషించారు. మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వంలో కరణ్ రాణా సహ దర్శకత్వంలో దాదాపు రెండేళ్లకు పైగా సాగిన పరిశోధనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. సుమారు 200 కోట్ల మేర సాగిన మోసాలు, బెదిరింపుల నెట్‌వర్క్‌తో పాటు.. ఉన్నత ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పుకుని బాధితులను ఎలా నమ్మించాడనే కోణాలను ఇందులో ఆవిష్కరించనున్నారు.

జైలులో ఉన్న మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పించడంలో సహాయం చేస్తానని అత‌డి భార్య అదితి సింగ్‌ను నమ్మించి.. సుమారు రూ. 200 -215 కోట్ల వరకు వసూలు చేసినట్లు మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. ఈ క‌థంతా సిరీస్ లో ఉంటుంది.

ఈ డాక్యుమెంటరీలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం బాలీవుడ్ తారలతో సుఖేష్‌కు ఉన్న సంబంధాలు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో పేరు బయటకు వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇతర రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న లింకులపై ఇందులో ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతేకాకుండా.. ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ తన దందాను ఎలా నడిపించగలిగాడనే వ్యవస్థాగత లోపాలను కూడా ఈ డాక్యుమెంటరీ ప్రశ్నించనుంది. ఈ సిరీస్ లో సుఖేష్ కేసుతో సంబంధాలు ఉన్న‌ నోరాఫ‌తేహి పాత్ర‌ను కూడా చూపించ‌నున్నారు.

కేవలం ఆర్థిక మోసాల గణాంకాలకే పరిమితం కాకుండా.. ఎదుటివారిని అంతగా నమ్మించి మోసం చేయడానికి సుఖేష్ అనుసరించిన సైక‌లాజిక‌ల్ వ్యూహాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అయితే సుఖేష్ చంద్రశేఖర్‌పై ఉన్న కేసులు ఇంకా న్యాయస్థానంలో విచారణ దశలోనే ఉన్నాయని.. ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉందని మేకర్స్ స్పష్టం చేశారు.

కోర్టు విచార‌ణ‌లో ఉండ‌గా డాక్యు సిరీస్ తీయొచ్చా?

భారత న్యాయవ్యవస్థ నిబంధనల ప్రకారం.. ఇంకా కోర్టులో విచారణ దశలో ఉన్న ఒక నిందితుడిపై డాక్యుమెంటరీ లేదా సిరీస్‌ను తెరకెక్కించి విడుదల చేయడానికి ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ- మీడియా హక్కుల కింద ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్ - ఛార్జ్‌షీట్- మీడియా కథనాల ఆధారంగా మేకర్స్ కంటెంట్‌ను రూపొందించవచ్చు. అయితే నిందితుడిని ముందే దోషిగా చిత్రీకరిస్తూ `మీడియా ట్రయల్` నిర్వహించకూడదనే కఠిన నిబంధన ఉంటుంది. అందుకే ఇలాంటి డాక్యుమెంటరీలలో ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని స్పష్టమైన డిస్‌క్లైమర్లు వేయడంతో పాటు, నిందితుడి వాదనకు కూడా అవకాశం ఇస్తారు. ఒకవేళ ఈ డాక్యుమెంటరీ వల్ల తమ న్యాయ విచారణకు ఆటంకం కలుగుతుందని లేదా తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని నిందితుడు భావిస్తే స్టే ఆర్డర్ కోరుతూ కోర్టును ఆశ్రయించే హక్కు వారికి ఉంటుంది. అలాంటి సందర్భాలలో మాత్రమే కోర్టు జోక్యం చేసుకుని విడుదలను ఆపే లేదా మార్పులు చేసే ఆదేశాలు జారీ చేస్తుంది.