సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌పై సుజోయ్ ఘోష్ కన్ను.. కహానీ3 లో భారీ ఛేంజ్!
అయితే ఈసారి కథతో పాటు మెయిన్ లీడ్ విషయంలో కూడా కీలక మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 27 July 2026 6:08 PM ISTబాలీవుడ్‌లో మోస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కహానీ సిరీస్‌కు సంబంధించిన తాజా డిస్కషన్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. డైరెక్టర్ సుజోయ్ ఘోష్ మరోసారి కహానీ3 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి కథతో పాటు మెయిన్ లీడ్ విషయంలో కూడా కీలక మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు భాగాల్లో కథకు కేంద్రబిందువుగా నిలిచిన విద్యా బాలన్ ప్లేస్ లో ఈసారి యామీ గౌతమ్‌ను తీసుకురావాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నారనే ప్రచారం బాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.
2012లో కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కహానీ రిలీజైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను నమోదు చేసింది. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ కథతో కూడా కమర్షియల్ సక్సెస్ సాధించవచ్చని నిరూపించింది. విద్యా బాలన్ యాక్టింగ్ ఆ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తర్వాత 2016లో వచ్చిన కహానీ2 విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, మొదటి భాగం స్థాయిలో బాక్సాఫీస్ ఫలితాలను అందుకోలేకపోయింది. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో భాగంపై మళ్లీ డిస్కషన్స్ మొదలయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం, కహానీ3 పూర్తిగా కొత్త కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త తరానికి కనెక్ట్ అయ్యే హీరోయిన్ ను ఎంపిక చేయాలనే ఆలోచనలో సుజోయ్ ఘోష్ ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వరుస సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న యామీ గౌతమ్ ఈ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ గా మారినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 సినిమాలో ఆమె యాక్టింగ్ కు నేషనల్ లెవెల్ గుర్తింపు రావడం, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమెకు పెరిగిన క్రేజ్ ఈ డెసిషన్ కు కారణమని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ క్యారెక్టర్లను సమర్థంగా పోషించే సామర్థ్యం యామీకి ఉండటంతో, కహానీ లాంటి ఫ్రాంచైజీకి ఆమె సరైన ఎంపిక అవుతారని మేకర్స్ భావిస్తున్నారనే డిస్కషన్ కూడా నడుస్తోంది.
మరోవైపు, గత రెండు భాగాలతో విడదీయరాని అనుబంధం కలిగిన విద్యా బాలన్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా, ఆమె కోసం స్పెషల్ క్యామియో క్యారెక్టర్ ను రూపొందించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి సినిమా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు డైరెక్టర్ సుజోయ్ ఘోష్ కానీ, నిర్మాణ సంస్థ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో యామీ గౌతమ్ నిజంగానే కహానీ3లో మెయిన్ లీడ్ గా నటిస్తారా? విద్యా బాలన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
