యువ దర్శకుడి తక్షణ కర్తవ్యం..ఒకేసారి ఇద్దరితో!
అయితే ఇక్కడ సినిమా అవకాశం ఇచ్చినది ఒక పెద్ద మాస్ హీరో, పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గనుక సుజీత్ లాంటి యువదర్శకుడు చాలా తర్జన భర్జన పడుతున్నాడట.
By: Sivaji Kontham | 14 Jun 2026 7:00 PM ISTచేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పుడు.. అందులోనూ ఆ రెండూ ఏమాత్రం మిస్ చేయకూడని క్రేజీ కాంబినేషన్లు అయినప్పుడు.. ఆ రెండిటినీ కాపాడుకునేందుకు ఎవరైనా దర్శకుడు ఏం చేయాలి? కచ్ఛితంగా ఒక తెలివైన దర్శకుడు చేయాల్సిన తక్షణ పని ఆ రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు బ్యాక్ టు బ్యాక్ ప్యారలల్ వర్క్ నడిపించడమే. ప్రస్తుతం టాలీవుడ్ యువ డైరెక్టర్ సుజీత్ సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. ఒకవైపు పవన్ కళ్యాణ్ `ఓజీ 2`, మరోవైపు నాని `బ్లడీ రోమియో` చిత్రాలను బ్యాలెన్స్ చేయడమే అతని ముందున్న తక్షణ కర్తవ్యం.
అయితే ఇక్కడ సినిమా అవకాశం ఇచ్చినది ఒక పెద్ద మాస్ హీరో, పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గనుక సుజీత్ లాంటి యువదర్శకుడు చాలా తర్జన భర్జన పడుతున్నాడట. అప్పటికే ప్రకటించేసిన సినిమాని కచ్ఛితంగా పూర్తి చేయాలి కాబట్టి....అసలు ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కించాలనే విషయంలో ముందు తన హీరోలను ఒప్పించే పనిలో సుజీత్ ఉన్నాడట. నేచురల్ స్టార్ నానితో ఇంతకుముందు `బ్లడీ రోమియో`' అనే చిత్రాన్ని ప్రకటించగా, ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ `ఓజీ` సీక్వెల్ కోసం కాల్షీట్లు కేటాయించడానికి అంగీకరించడంతో వెనువెంటనే సుజీత్ తన ప్రణాళికల్ని మార్చుకోవాల్సి వచ్చింది.
శరవేగంగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పక్కా బౌండ్ స్క్రిప్టు.. పకడ్బందీ ప్రీప్రొడక్షన్ తో ముందుకు రానున్నారు. దీనికోసం సుజీత్ అండ్ టీమ్ ప్రస్తుతం గట్టి కసరత్తులు చేస్తోందని ఇండస్ట్రీ టాక్. అయితే అప్పటికే నానీతో అఫీషియల్‌గా ప్రకటించేసిన `బ్లడీ రోమియో` సినిమా కూడా ఆగకుండా ప్లాన్ చేయాలని సుజీత్ అంతరంగం చెబుతోందట. ఏ ఒక్క ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లినా అది దర్శకుడిగా సుజీత్ కెరీర్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి... నాని సినిమాను కూడా సమాంతరంగా లైన్లో పెట్టాలని ఆయన భావిస్తున్నాడు.
కానీ పవన్ కల్యాణ్‌తో సినిమా అనగానే దానికోసం కేటాయించిన షెడ్యూల్స్ అస్సలు మిస్ కాకూడదు. అటు పొలిటికల్ మీటింగులు, ప్రభుత్వ బాధ్యతలు.. ఇటు సినిమా షెడ్యూళ్లను చాలా తెలివిగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది గనుక పవన్ కల్యాణ్ కోసం ప్రతిదీ సరైన ప్రణాళికతో చేయాల్సి ఉంటుంది. పవన్ సైతం ఎంతో డెడికేటెడ్ గా `ఓజీ 2`కోసం తన వంతు పనిని చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సుజీత్ ఆ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా షూటింగ్ ప్లాన్ చేయాల్సి ఉంది.
`ఓజీ` (OG) బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి. సీక్వెల్ కోసం స్క్రిప్టు పరంగా రెండు వందల శాతం కష్టపడి మెరుగైన అవుట్‌పుట్‌తో ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ లో అడ్వాన్స్ డ్ ప్రణాళికలు రెడీ చేసుకుంటేనే పవన్ కాల్షీట్లకు అనుగుణంగా పని చేసే వీలుంటుంది. మొత్తానికి `ఓజీ 2` శరవేగంగా పూర్తి చేయగానే... ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నానీతో `బ్లడీ రోమియో` ప్రాజెక్ట్ కోసం సుజీత్ సిద్ధం కావాల్సి ఉంటుంది.
