పిక్‌టాక్ : ఓజీ - ఉస్తాద్ ఒక్క చోట కలిస్తే...!
కాస్త నిరుత్సాహం కలిగించినా పవన్ కళ్యాణ్‌ను వెండి తెరపై చూస్తే చాలు అనుకునే వారికి పెద్ద పండుగే అనడంలో సందేహం లేదు. ఇక మిగిలిన రెండు సినిమాలు రావాల్సి ఉన్నాయి.
By: Ramesh Palla | 1 Aug 2025 7:30 PM ISTపవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కాకముందు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, సాహో సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. రాజకీయాల కారణంగా దాదాపు ఏడాది పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా మరో ఏడాది పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు మూడు సినిమాల షూటింగ్స్‌కు డేట్లు ఇచ్చాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాస్త నిరుత్సాహం కలిగించినా పవన్ కళ్యాణ్‌ను వెండి తెరపై చూస్తే చాలు అనుకునే వారికి పెద్ద పండుగే అనడంలో సందేహం లేదు. ఇక మిగిలిన రెండు సినిమాలు రావాల్సి ఉన్నాయి.
సుజీత్ దర్శకత్వంలో ఓజీ
సాహో వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీను చేస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. వీరమల్లుతో పోల్చితే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ ను ఎలా ఫ్యాన్స్ చూడాలి అనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూడబోతున్నారు. అందుకే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజీత్ ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడి స్పెషల్‌గా రూపొందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఓజీని సుజీత్ చేతిలో వదిలేశాడు. వచ్చే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్ లో సుజీత్ ఉన్న విషయం తెల్సిందే.
హరీష్ శంకర్, సుజీత్ ఒకే ఫ్రేమ్‌లో..
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా పూర్తి చేద్దాం అని డేట్లు కేటాయించారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్ రాబోతుంది. ఈ ఏడాది చివర్లోనే సినిమా విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ తో వర్క్ చేస్తున్న ఓజీ దర్శకుడు సుజీత్, ఉస్తాద్ దర్శకుడు హరీష్ శంకర్ కలిసి కనిపించారు. వీరిద్దరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ వంటి సూపర్ స్టార్‌తో వర్క్ చేసే అవకాశం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. వీరికి ఆ అదృష్టం దక్కడం, ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫోటో వైరల్ అవుతోంది.
గబ్బర్ సింగ్ తర్వాత...
హరీష్ శంకర్‌తో గతంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే వీరి కాంబో మూవీ కోసం చాలా ఆసక్తిగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అంటూ ఊహించుకుంటున్నారు. నీ సినిమా ఎలా వస్తుంది అంటే నీ సినిమా ఎలా వస్తుంది అని ఒకరిని ఒకరు ప్రశ్నిస్తున్నట్లుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల గురించి మరోసారి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
