Begin typing your search above and press return to search.

సుజీత్‌ పై నమ్మకం ఎందుకు పెరుగుతోంది?

టాలీవుడ్‌ లో దర్శకుల కెరీర్‌ ఒక్క సినిమాతోనే మారిపోవడం కొత్త విషయం కాదు. అయితే తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకోవడం మాత్రం కొంతమందికే సాధ్యమవుతుంది.

By:  M Prashanth   |   22 July 2026 4:16 PM IST
సుజీత్‌ పై నమ్మకం ఎందుకు పెరుగుతోంది?
X

టాలీవుడ్‌ లో దర్శకుల కెరీర్‌ ఒక్క సినిమాతోనే మారిపోవడం కొత్త విషయం కాదు. అయితే తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకోవడం మాత్రం కొంతమందికే సాధ్యమవుతుంది. ప్రస్తుతం అలాంటి దర్శకుల జాబితాలో సుజీత్ పేరు ముందువరుసలో కనిపిస్తోంది. చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత బిజీ దర్శకుల్లో ఒకరిగా మారారు.

2014లో విడుదలైన రన్ రాజా రన్ తో సుజీత్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కథను చెప్పిన విధానం, స్క్రీన్‌ ప్లేకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి సినిమాతోనే తనపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. ఆ తర్వాత ఊహించని స్థాయిలో అవకాశాలు అందుకున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం రావడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, యాక్షన్ సన్నివేశాలు, టెక్నికల్ వాల్యూస్ విషయంలో సుజీత్‌ కు ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా పెద్ద బడ్జెట్ చిత్రాన్ని హ్యాండిల్ చేయగల స్టామినా ఆయనకు ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.

సాహో తర్వాత సుజీత్ నుంచి సినిమా రావడానికి కొంత సమయం పట్టింది. అయితే ఆయన పేరు మాత్రం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే వచ్చింది. స్టార్ హీరోలకు కథలు వినిపించడం, కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరపడం వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలిచాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ తర్వాత ఆయన వర్క్ స్టైల్ పై హీరోల్లోనూ నమ్మకం పెరిగినట్లు అంతా చెబుతుంటారు.

ఇప్పుడు ఆయన లైనప్ లో ఉన్న ఓజీ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఆ ప్రాజెక్టుపై భారీగా చర్చ జరుగుతుండటం విశేషం. అంతే కాదు ఆ మూవీ అప్ కమింగ్ అప్డేట్ కోసం అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవైపు పవన్ స్టార్‌ డమ్, మరోవైపు సుజీత్ టేకింగ్‌ పై ఉన్న నమ్మకం.. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సుజీత్ విషయంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆయన సినిమాల్లో కనిపించే స్టైలిష్ ప్రెజెంటేషన్.

పాత్రల డిజైన్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ వరకు ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఇండస్ట్రీలో పేరుంది. అందుకే ఆయనకు వరుసగా పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటికే చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయి చిత్రాల వరకు ప్రయాణించిన సుజీత్.. రానున్న రోజుల్లో మరిన్ని భారీ అవకాశాలు అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కథపై నమ్మకం, టెక్నికల్‌ గా స్ట్రాంగ్ ప్రెజెంటేషన్, స్టార్ హీరోలను డీల్ చేసే స్టామినా.. ఆ మూడు అంశాలే సుజీత్‌ పై ఇండస్ట్రీ నమ్మకం పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అలా టాలీవుడ్‌ లో యువ దర్శకులలో సుజీత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు