Begin typing your search above and press return to search.

చాలా భయపడ్డాను: కోలీవుడ్ ఎంట్రీపై సుహాస్ ఓపెన్ టాక్!

యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ నుంచి మొదలై నేడు వెండితెరపై హీరోగా, విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సుహాస్.

By:  M Prashanth   |   6 Sept 2026 9:43 AM IST
చాలా భయపడ్డాను: కోలీవుడ్ ఎంట్రీపై సుహాస్ ఓపెన్ టాక్!
X

యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ నుంచి మొదలై నేడు వెండితెరపై హీరోగా, విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. ఆయన కోలీవుడ్‌లో మొదటిసారి నెగెటివ్ రోల్ చేస్తూ నటించిన లేటెస్ట్ సీ యాక్షన్ డ్రామా మండాడి. తమిళంలో సూరి లీడ్ రోల్ చేయగా, మతిమారన్ పుగళేంది డైరెక్షన్‌లో వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా రూపొందింది.

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సుహాస్ మాట్లాడిన మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. షార్ట్ ఫిలిం డేస్ నుంచి ఇంత పెద్ద స్కేల్ మూవీ వరకు రావడం కలలా ఉందని సుహాస్ ఎమోషనల్ అయ్యారు.

సెప్టెంబర్ 5 టీచర్స్ డే కావడంతో తన ఎదుగుదలకు కారణమైన దర్శకులను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మార్నింగ్ 5 గంటలకే నిద్రలేచి సెట్‌కి వెళ్లే అలవాటు శివ నిర్వాణ నేర్పించారని చెప్పారు. తనకు కెరీర్‌లో బిగ్ బ్రేక్ ఇచ్చిన శివ నిర్వాణకు, హిట్ 2లో విలన్‌గా పరిచయం చేసిన శైలేష్ కొలనుకు, రైటింగ్ నేర్పిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో 'ది అథితి' షార్ట్ ఫిలిం ఒక ఫేజ్ అయితే, మజిలీ, కలర్ ఫోటో తర్వాతి ఫేజ్‌లుగా నిలిచాయని, ఇప్పుడు మండాడి మరో కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుందని అన్నారు.

తమిళంలో మొదటిసారి నటిస్తున్నప్పుడు ఎదురైన భయం, అనుభవాలను సుహాస్ వివరించారు. అక్కడ ఎవరూ తెలియకపోవడంతో మొదట చాలా భయపడ్డానని, అయితే నిర్మాత ఎల్రెడ్ కుమార్, టీమ్ అంతా సొంత వాడిలా చూసుకున్నారని చెప్పారు. భాష రాక తాను సతమతమవుతుంటే దర్శకుడు మతిమారన్ ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ను స్వయంగా చేసి చూపిస్తూ కన్నీళ్లు ఇక్కడివరకే రావాలంటూ రూల్స్ పెట్టి ఇంకాస్త టెన్షన్ పెట్టారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే నిర్మాత ఏకంగా 1500 మందిని పెట్టి సినిమాను అత్యంత భారీగా తీశారన్నారు.

హీరో సూరి చూపించిన ఆప్యాయత గురించి చెబుతూ సుహాస్ ఎంతో మురిసిపోయారు. షూటింగ్ మొదలవ్వక ముందు నుంచే సూరి తనను ఒక సొంత తమ్ముడిలా చూసుకున్నారని వెల్లడించారు. సూరి కుటుంబ సభ్యులు కూడా తన సొంత ఫ్యామిలీలా మారిపోయారని, చెన్నైలో తాను ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లే అన్ని ఏర్పాట్లు స్వయంగా చేసి ఎంతగానో కంఫర్ట్‌గా ఉంచారని కృతజ్ఞతలు తెలియజేశారు.

సాంకేతిక నిపుణుల గురించి చెబుతూ డీవోపీ కదిర్ సార్ వినూత్న ప్రయోగాన్ని సుహాస్ బయటపెట్టారు. సముద్రపు అలల మధ్య విజువల్స్ సరికొత్తగా క్యాప్చర్ చేయడానికి ఆయన ఒక అక్వేరియం లాంటి గ్లాస్ బాక్స్‌ను స్వయంగా తయారు చేసి, అందులో కెమెరా పెట్టి అద్భుతమైన షాట్స్ తీశారని చెప్పారు. అలాగే హీరోయిన్ మహిమా నంబియార్ స్క్రీన్ మీద అద్భుతంగా నటించారని, రవీంద్ర విజయ్ చాలా న్యాచురల్ యాక్టింగ్‌తో అలరించారని పేర్కొన్నారు.

అభినవ కవి రాసిన పాటలోని లోతైన భావాలు వినగానే ఆశ్చర్యపోయి స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకున్నట్లు తెలిపారు. సినిమా రిలీజ్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సుహాస్ అన్నారు. ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త సముద్రపు విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని భరోసా ఇచ్చారు. ఆడియన్స్ పెట్టుకున్న భారీ అంచనాలను ఈ చిత్రం ఏమాత్రం తగ్గించదని, మండాడి కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.