Begin typing your search above and press return to search.

సముద్రంలో మృత్యువు ముందుకు వెళ్లి షూటింగ్ చేసిన హీరోలు!

అలాంటి మృత్యు ముఖంలోకి వెళ్లి సాహసోపేతంగా షూటింగ్ చేసిన తెలుగు, తమిళ, హిందీ కథానాయకుల నిబద్ధత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

By:  Sivaji Kontham   |   6 Sept 2026 5:00 PM IST
సముద్రంలో మృత్యువు ముందుకు వెళ్లి షూటింగ్ చేసిన హీరోలు!
X

సినిమా తెరపై సన్నివేశాలు అత్యంత సహజంగా.. రియలిస్టిక్‌గా రావాలనే తపనతో సినీ పరిశ్రమలో కొందరు నటులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. నిత్యం అల్లకల్లోలంగా ఉండే నడిసముద్రంలోకి వెళ్లి చిత్రీకరణ జరపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ భారీ తుఫాన్లు, హఠాత్తుగా వచ్చే రాకాసి అలలు, సుడిగుండాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. తీరం దాటి 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లే కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. పడవలు బోల్తా పడినా, ప్రమాదం జరిగినా కాపాడేవారు కూడా వెంటనే అందుబాటులో ఉండరు. అలాంటి మృత్యు ముఖంలోకి వెళ్లి సాహసోపేతంగా షూటింగ్ చేసిన తెలుగు, తమిళ, హిందీ కథానాయకుల నిబద్ధత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఇటీవల నటించిన చిత్రం కోసం చేసిన సాహసాలు ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశాయి. ఈ సినిమా కోసం మొత్తం 130 రోజుల పాటు చిత్రీకరణ జరగగా, అందులో ఏకంగా 74 రోజులు సముద్రంలోనే షూట్ చేశారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం 45 రోజులు, ఇంటర్వెల్ బ్లాక్ కోసం 17 రోజుల పాటు నడిసముద్రంలోనే గడిపారు. తీరం నుండి సుమారు 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి షూటింగ్ చేస్తున్నప్పుడు భయంకరమైన ఈదురుగాలులకు పడవలు అదుపుతప్పి బోల్తా పడే పరిస్థితులు ఎదురయ్యాయని.. సరిగ్గా సమయానికి నీటిలోకి దూకకపోతే ఆ పడవలు తమపైనే పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేదని సుహాస్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో చావు అంచుల దాకా వెళ్లి బతికాననే భావన కలిగిందని ఆయన వెల్లడించారు.

ఇక టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి భారతీయ తొలి అండర్ వాటర్ నేవీ ఫిల్మ్ `ఘాజీ` కోసం విశాఖపట్నం తీరం నుండి నడిసముద్రంలోకి వెళ్లి నేవీ నిపుణుల పర్యవేక్షణలో సబ్‌మెరైన్ అండర్ వాటర్ సీన్స్ చేశారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ తన `దశావతారం` చిత్రంలోని సునామీ సీన్స్ కోసం నావికాదళ అనుమతులతో సముద్రం లోపలికి వెళ్లి ప్రొఫెషనల్ డైవర్లతో కలిసి అరుదైన విజువల్స్ చిత్రీకరించారు. అలాగే మరొక తమిళ నటుడు, చియాన్ విక్రమ్ `కడారమ్ కొండన్` చిత్రం కోసం మలేషియా తీరంలో కోస్ట్ గార్డ్ సాయంతో రాత్రిపూట నడిసముద్రంలోని బోట్లపై భారీ యాక్షన్ సీన్లు చేసి అందరినీ మెప్పించారు.

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం `తండేల్` కోసం చిత్రబృందం నడిసముద్రంలో అత్యంత సాహసోపేతంగా చిత్రీకరణ జరిపింది. శ్రీకాకుళం మత్స్యకారుల యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా ఉడుపి, గోవా, విశాఖపట్నం తీరాల నుంచి కిలోమీటర్ల కొద్దీ సముద్రం లోపలికి వెళ్లి.. వందలాది బోట్లు.. అసలైన జలచరాల మధ్య సహజసిద్ధమైన వాతావరణంలో నెలల తరబడి షూటింగ్ చేశారు. ఈ క్రమంలో నాగచైతన్య బరువు పెరగడం, శ్రీకాకుళం యాస నేర్చుకోవడమే కాకుండా... విపరీతమైన సముద్రపు అలలు, ఈదురుగాలులు, తీవ్రమైన మోషన్ సిక్‌నెస్‌ను తట్టుకుంటూ డూప్ లేకుండా సొంతంగా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు. నడిసముద్రంలో బోట్లు అదుపుతప్పే ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా.. సీన్స్ రియలిస్టిక్‌గా రావడం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నాగచైతన్య చేసిన ఈ రిస్క్ అత‌డికి వృత్తిపై ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

బాలీవుడ్ విషయానికి వస్తే ఖిలాడీ అక్షయ్ కుమార్ `బ్లూ` సినిమా కోసం సంజయ్ దత్, జాయెద్ ఖాన్‌లతో కలిసి బహామాస్ వద్ద సముద్రంలో 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి.. ప్రాణాంతకమైన సొరచేపలు (షార్క్స్) తిరిగే నీటి గర్భంలో లైవ్ యాక్షన్ సీన్స్ చేశారు. `రామ్ సేతు` కోసం కూడా ప్రత్యేక డైవింగ్ సూట్లతో షూట్ చేశారు. మరోవైపు మిస్టర్ పర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి `థగ్స్ ఆఫ్ హిందోస్థాన్` చిత్రం కోసం మాల్టా దీవుల సమీపంలో నడిసముద్రంలో రెండు భారీ నౌకలను నిర్మించి.. నెలల తరబడి అలల మధ్యే బస చేస్తూ భారీ యాక్షన్ సీక్వెన్సులను పూర్తి చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఆశయంతో ఈ కథానాయకులు చేసిన సాహసాలు అభినందనీయం. తీవ్రమైన గాలులు, విపరీతమైన మోషన్ సిక్‌నెస్, ప్రాణాపాయ పరిస్థితులను తట్టుకుని సముద్ర గర్భంలో అంత సుదూరంలోకి వెళ్లి పనిచేయడం వారి వృత్తి పట్ల ఉన్న అంకితభావానికి... సినిమాపై ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది.