'కలర్ ఫోటో' తర్వాత మళ్లీ ఇదే.. ఇప్పటివరకూ చూడని విజువల్స్ చూస్తారు: సుహాస్
సముద్రం నేపధ్యంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సీ అడ్వెంచర్ చిత్రం `మందాడి`. (తమిళంలో మారెమ్మ) ప్రీ రిలీజ్ వేడుకలో యువ కథానాయకుడు సుహాస్ పాల్గొని అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు.
By: Sivaji Kontham | 6 Sept 2026 10:31 PM ISTసముద్రం నేపధ్యంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సీ అడ్వెంచర్ చిత్రం `మందాడి`. (తమిళంలో మారెమ్మ) ప్రీ రిలీజ్ వేడుకలో యువ కథానాయకుడు సుహాస్ పాల్గొని అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. షార్ట్ ఫిలిమ్స్ తీసే స్థాయి నుంచి ఇంతటి భారీ బడ్జెట్- గ్రాండ్ స్కేల్ సినిమాలో భాగమవ్వడం తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. తన సినీ ప్రయాణంలో కొన్ని సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయని.. `అతిథి` షార్ట్ ఫిలిం, `మజిలీ`, `కలర్ ఫోటో`ల తర్వాత `మందాడి` చిత్రం తన కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనకు మార్గదర్శకులుగా నిలిచిన దర్శకులు శైలేష్ కొలను, శివ నిర్వాణలకు సుహాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉదయాన్నే లేచి క్రమశిక్షణతో సెట్‌కి వెళ్లడం శివ నిర్వాణ అలవాటు చేశారని, `మజిలీ`లో మంచి బ్రేక్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అలాగే శైలేష్ కొలను తనకు మొదటిసారి విలన్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు. తమిళ పరిశ్రమలో నటుడిగా అడుగుపెడుతున్నప్పుడు మొదట్లో కొంత భయం వేసినా అక్కడ అందరూ తనను సొంత మనిషిలా ఆదరించారని తెలిపారు.
ఈ చిత్రంలో తనను నమ్మి పవర్‌ఫుల్ పాత్రను ఇచ్చిన దర్శకుడు మదిమారన్‌కు, నిర్మాత ఎల్‌రెడ్ కుమార్‌కు సుహాస్ కృతజ్ఞతలు తెలిపారు. భాష సరిగ్గా రాక టెన్షన్ పడుతున్న సమయంలో దర్శకుడు ప్రతీ ఎక్స్‌ప్రెషన్ చేసి చూపిస్తూ తన నుంచి ఉత్తమ నటనను రాబట్టారని కొనియాడారు. హీరో సూరి తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని.. ఆయన కుటుంబం కూడా తనను ఎంతో ఆప్యాయంగా ఆదరించిందని.. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు.
ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను కచ్చితంగా మంత్రముగ్ధులను చేస్తాయని సుహాస్ ధీమా వ్యక్తం చేశారు. సినిమాటోగ్రాఫర్ కదీర్ (జై భీమ్ ఫేమ్) పనితనాన్ని అభినందిస్తూ.. సాధారణ కెమెరాలతో తీయడం సాధ్యపడని కొన్ని కష్టమైన సముద్రపు షాట్ల కోసం ఆయనే ప్రత్యేకంగా ఒక `అక్వేరియం బాక్స్` ఇన్వెన్షన్ తయారు చేసి విజువల్స్ షూట్ చేశారని వెల్లడించారు. కథానాయిక మహిమా నంబియార్, నటుడు రవీంద్ర విజయ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రతి ఒక్కరి పాత్రలు సినిమాలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
చాలా కాలం తర్వాత ప్రేక్షకుల నుంచి `మందాడి` సినిమా విడుదల కోసం ఇంతటి భారీ నిరీక్షణను చూస్తున్నానని సుహాస్ పేర్కొన్నారు. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఈ చిత్రం ఏమాత్రం తగ్గదని... తెరపై ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త విజువల్స్‌ను చూస్తారని హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పెద్ద విజయాన్ని అందించాలని ఆయన కోరారు.
