Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌లో సుహాస్‌కు భారీ బ్రేక్ దొరకబోతోందా?

టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఇప్పుడు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగు వేస్తున్నాడు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Sept 2026 2:00 PM IST
కోలీవుడ్‌లో సుహాస్‌కు భారీ బ్రేక్ దొరకబోతోందా?
X

టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఇప్పుడు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగు వేస్తున్నాడు. సాధారణంగా హీరోగా సక్సెస్ అందుకున్న తర్వాత నటులు తమ స్టార్ ఇమేజ్‌కు సరిపోయే పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటాం. కానీ సుహాస్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళ సినిమాతో కొత్త మార్కెట్‌లోకి అడుగుపెడుతూ ఆయన ఎంచుకున్న క్యారెక్ట‌ర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన డిస్క‌ష‌న్‌కు కారణమవుతోంది.

తెలుగులో హీరోగా ఛాన్సులు అందుకుంటున్న టైమ్‌లోనే తమిళంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌ను చేయడానికి సుహాస్ అంగీకరించడం వెనుక స్పష్టమైన కెరీర్ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా నటుడిగా తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ డెసిష‌న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు హీరో ఇమేజ్ కంటే నటుడిగా తన సామర్థ్యాన్ని చూపించే పాత్రను ఎంచుకోవడం సుహాస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇటీవలి కాలంలో సౌత్ సినీ ఇండ‌స్ట్రీల మధ్య సరిహద్దులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు భాష ఆధారంగా నటీనటుల మార్కెట్ పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం మంచి పాత్ర ఉంటే ఏ ఇండస్ట్రీకి చెందిన నటుడైనా మరో భాషలో అవకాశాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాల పెరుగుదలతో పాటు ఆడియ‌న్స్ కూడా భాష కంటే కంటెంట్, యాక్టింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ మార్పుకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగు నటులకు కోలీవుడ్‌లో అవకాశాలు పెరగడం కూడా ఆసక్తికరమైన పరిణామమే. ముఖ్యంగా విభిన్నమైన పాత్రలను పోషించగల నటుల కోసం మేకర్స్ ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు. సుహాస్ తమిళ ఎంట్రీ కూడా ఇదే మారుతున్న పరిస్థితికి ఉదాహరణగా కనిపిస్తోంది. అయితే సుహాస్‌కు అసలైన పరీక్ష ఇప్పుడు మొదలుకానుంది. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఒక ఎత్తయితే, విల‌న్ గా అందులోనూ ఇత‌ర భాష‌లో ఆడియ‌న్స్ ను మెప్పించి, త‌న యాక్టింగ్ తో ఇంపాక్ట్ చూపించడం మరోక‌ ఎత్తు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులకు కొత్త అయిన సుహాస్ తన యాక్టింగ్‌తో అక్కడ ఎంత త్వరగా కనెక్ట్ అవుతాడన్నది ఆసక్తికరం.

ఈ నేప‌థ్యంలో సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తూ విల‌న్ గా న‌టిస్తున్న మందాడి సినిమా సక్సెస్ అయితే మాత్రం సుహాస్‌కు కోలీవుడ్‌లో మరిన్ని విభిన్నమైన అవకాశాలు రావచ్చు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ అనే ఇమేజ్‌లకు పరిమితం కాకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే సుహాస్ ప్రయత్నానికి ఈ సినిమా కీలక మలుపుగా మారుతుందేమో చూడాలి.