Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల మ‌ధ్య వైరం బ‌య‌ట‌కొచ్చిందిలా!

సౌత్ లో సంచలనం సృష్టించిన `ది కేరళ స్టోరీ` మ‌రోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అది సినిమా విజయానికి సంబంధించింది కాదు.

By:  Srikanth Kontham   |   8 May 2026 6:00 AM IST
ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల మ‌ధ్య వైరం బ‌య‌ట‌కొచ్చిందిలా!
X

సౌత్ లో సంచలనం సృష్టించిన `ది కేరళ స్టోరీ` మ‌రోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అది సినిమా విజయానికి సంబంధించింది కాదు. ఆ సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధానికి సంబం ధించింది. ఈ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. `ది కేరళ స్టోరీ 2` ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం, ఇత‌ర‌ అంశాలపై విపుల్ షా అబద్ధాలు ఆడుతున్నారని సుదీప్తో బహిరంగంగా విమర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో విపుల్ షా `కేర‌ళ స్టోరీ 2` విషయంలో ఇచ్చిన వివరణలను సుదీప్తో పూర్తిగా ఖండించారు. విపుల్ షా నిజాన్ని మాట్లాడాల్సిందని కానీ ఆయన అబద్ధాలను చెప్పడానికే మొగ్గు చూపారని సుదీప్తో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక సినిమా విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ పంచుకోవడంలో ఉండే ఉత్సాహం, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వివాదాలుగా మారడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సుదీప్తో సేన్ వాదన ప్రకారం దర్శకుడిగా సినిమా సృజనాత్మకతలో ఇతర కీలక నిర్ణయాల్లో తన పాత్రను తక్కువ చేసి చూపడం తప్పుగా చిత్రీకరించడం ఆయన్ని నొప్పించింది. `ది కేరళ స్టోరీ` వంటి సున్నితమైన అంశంతో కూడిన సినిమాను తెరకెక్కించినప్పుడు పడ్డ కష్టాన్ని విస్మరించి వ్యాపార కోణంలోనే లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వాస్తవాలను వక్రీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంత వ‌ర‌కూ సైలెంట్ గా ఉన్న సుదీప్తో సేన్ ఒక్క సారిగా మీడియా ముందుకు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ కార‌ణాలుగానే `ది కేర‌ళ స్టోరీ 2` నుంచి సుదీప్తోసేన్ త‌ప్పుకున్న‌ట‌లు ఇప్ప‌టికీ క్లారిటీ వ‌చ్చింది. భారీ విజయాన్ని అందుకున్న కాంబినేషన్ ఇలా విడిపోవడం పట్ల సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విపుల్ షా తన పద్ధతిని మార్చుకోవాలని, పరిశ్రమలో నిజాయితీగా ఉండటం ముఖ్యమని సుదీప్తో ప్రకటనలో స్పష్టం చేశారు. సత్యం ఎప్పుడూ దాగదని త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే విపుల్ షా వర్గం నుండి ఈ విమర్శలపై ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

సాధారణంగా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ల మధ్య ఇగో సమస్యలు రావడం సహజమే. అబద్ధాలు చెబుతున్నారని దర్శకుడు నిర్మాతపై నేరుగా దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే సుదీప్తో సేన్ కేర‌ళ స్టోరీ సీక్వెల్ నుంచి త‌ప్పుకున్న లోపం సినిమాపై తీవ్ర ప్ర‌భావాన్నే చూపించింద‌న్న‌ది వాస్త‌వం. రెండ‌వ భాగానికి కామాఖ్య నారాయ‌ణ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 50 కోట్ల వ‌సూళ్ల‌ను కూడా సాధించ‌లేదు. 30 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 48 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. కానీ 15 కోట్ల‌లో నిర్మించిన `ది కేర‌ళ స్టోరీ` బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి చిన్న సినిమాల్లో స‌రికొత్త రికార్డునే సృష్టించింది. ఈ సినిమా ర‌చ‌నా విభాగంలో నిర్మాత విపుల్ షా కూడా భాగ‌స్తులే. ఈ నేప‌థ్యంలో సుదీప్తో సేన్ తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది.