పాన్ ఇండియా అడుగుల్లో జబర్దస్త్ కమెడియన్!
తాజాగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు సుడిగాలి సుధీర్. హైలెస్సో టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ మూవీతో ప్రసన్న కుమార్ కోట దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
By: M Prashanth | 29 Sept 2025 7:53 PM ISTసుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే లీడ్ రోల్ లో నాలుగు సినిమాలు చేసి తనదైన ముద్ర వేశారు.
తాజాగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు సుడిగాలి సుధీర్. హైలెస్సో టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ మూవీతో ప్రసన్న కుమార్ కోట దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్ పై శివ చెర్రీ, రవి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి.
ఆ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సహా అనేక మంది సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. హీరో నిఖిల్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. నిర్మాత బన్నీ వాస్ మూవీ స్క్రిప్ట్ మేకర్స్ కు అందించారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు.
అయితే హైలెస్సో మూవీ టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతున్న తెలుస్తోంది. మైథలాజికల్ టచ్ కూడా మేకర్స్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. పోస్టర్ లో కాలికి ఉంగరాలు, బంగారు చీలమండలతో ఓ పాదం ఉంది.
అది కూడా గంభీరంగా పచ్చ రంగు ఆకుపై ఉంది. ఆ పక్కన సింధూరం రంగులో అన్నం, కోడి- మేక తలలు ఉన్నాయి. దీంతో సినిమా.. గ్రామీణ నేపథ్యంలో జాతరను బ్యాక్ డ్రాప్ ను తీసుకున్నారని తెలుస్తోంది. పోస్టర్ లో రక్తంతో తడిసిన కత్తి ఉండటం గమనార్హం. అయితే మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది.
ఇక సినిమా విషయానికొస్తే.. నటాషా సింగ్, నక్ష కిరణ్ హీరోయిన్లుగా యాక్ట్ చేయనున్నారు. విలన్ రోల్ లో శివాజీ.. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజేంద్రన్, గెటప్ శ్రీను, శరణ్య సహా పలువురు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి హైలెస్సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
