Begin typing your search above and press return to search.

జాతిపిత లో కొత్త పాయింట్ ని ట‌చ్ చేస్తోన్న న‌యా డైరెక్ట‌ర్!

కేవలం చారిత్రాత్మక సంఘటనలను చూపించడమే కాకుండా ఆ 21 రోజుల సమయంలో మహాత్మా గాంధీ మనసులో నడిచిన అంతర్గత సంఘర్షణను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 11:54 AM IST
జాతిపిత లో కొత్త పాయింట్ ని ట‌చ్ చేస్తోన్న న‌యా డైరెక్ట‌ర్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. బాపూజీ పాత్రకు పలువురు ప్రముఖ నటులు ప్రాణం పోసి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఈ జాబితాలో మరో టాలెంటెడ్ నటుడు చేరుతున్నారు. విలక్షణ నటనకు మారుపేరైన మనోజ్ బాజ్‌పేయి మహాత్మా గాంధీ పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు తెరపై గాంధీ పాత్రను బెన్ కింగ్స్లే, నసీరుద్దీన్ షా, దిలీప్ ప్రభావల్కర్, దర్శన్ జరివాలా వంటి అగ్ర నటులు పోషించి ప్రశంసలు అందుకున్నారు.

అయితే వారందరికీ భిన్నంగా గాంధీజీ జీవితంలోని అత్యంత కీలకమైన ఎవరికీ అంతగా తెలియని ఓ సున్నితమైన కోణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి ముందు జరిగిన పరిణామాలు - గాంధీజీ వ్యక్తిగత మథనాన్ని ఈ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సుధీర్ మిశ్రా మాట్లాడుతూ.. దేశం స్వాతంత్య్రం పొందుతున్న సమయంలో ఢిల్లీ రాజకీయ కేంద్రంగా మారుతున్న తరుణంలో గాంధీజీ తీసుకున్న అనూహ్య నిర్ణయం చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలిపారు.

కేవలం చారిత్రాత్మక సంఘటనలను చూపించడమే కాకుండా ఆ 21 రోజుల సమయంలో మహాత్మా గాంధీ మనసులో నడిచిన అంతర్గత సంఘర్షణను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. అనుభవ్ సిన్హా నిర్మాణంలో రూపుది ద్దుకుంటున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయితో పాటు సౌరభ్ శుక్లా కూడా మరో కీలక పాత్రలో నటించనున్నారు. సామాజిక, రాజకీయ అంశాలతో కూడిన సినిమాలను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సుధీర్ మిశ్రా, ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.

మనోజ్ బాజ్‌పేయి లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ గాంధీజీ పాత్రను ఎలా మలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చరిత్రలో మహాత్మా గాంధీ పాత్రను తెరపైకి తీసుకురావడం అనేది నటులకు ఎంత సవాలుతో కూడుకున్నదో? దర్శకులకు కూడా అంతే బాధ్యతతో కూడుకున్న విషయం. గతంలో వచ్చిన కొన్ని బయోగ్రఫీ చిత్రాలు గాంధీజీని దేవుడిలా చూపిస్తే? మరికొన్ని గాంధీ వ్యక్తిగత జీవితంలోని లోపాలను లేదా కఠిన సత్యాలను చర్చించాయి.

తాజాగా మనోజ్ బాజ్‌పేయి సినిమా కూడా అలాంటి చారిత్రాత్మక సత్యాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వెండితెరపై బాపూజీ పాత్రకు మరోసారి జీవం పోయడానికి మనోజ్ బాజ్‌పేయి సిద్ధమవుతుండటంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్ప‌డుతున్నాయి. చరిత్రలోని అరుదైన కోణాలను వెలికితీస్తూ రాబోతున్న సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.