సుదీర్ బాబు గేర్ మార్చుతున్నాడా?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన కెరీర్లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సోలో హీరోగా కొనసాగుతూనే నెగెటివ్, గ్రే షేడ్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో హిందీ చిత్రం ‘బాఘీ’లో విలన్‌గా మెప్పించిన సుధీర్, పాన్ ఇండియా సినిమాల్లో బలమైన ప్రతినాయక పాత్రలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
By: Srikanth Kontham | 24 Nov 2026 11:32 PM ISTటాలీవుడ్ లో తనదైన ఫిట్నెస్ తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు కెరీర్లో కొత్త మలుపు కనిపిస్తోందా? అంటే అనే చర్చ ఇండస్ట్రీలో ఊపందుకుంది. సోలో హీరోగా వరుస విజయాలు అందుకోవడంలో ఆశించినంత వేగం కనిపించని నేపథ్యంలో సుదీర్ పంథా మార్చుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకొస్తుంది. టాలీవుడ్ సినిమాల పాన్ ఇండియా విస్తృతి పెరుగుతున్న వేళ పాత్రల ఎంపికలో సుధీర్ కొత్త కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం.
హిందీలో బాఘీ సినిమాలో విలన్‌గా కనిపించినప్పుడు సుధీర్ బాబుకు మంచి గుర్తింపే వచ్చింది. ఫిజికల్ అప్పియరెన్స్.. యాక్షన్ సీక్వెన్స్‌లలో సుదీర్ ఈజ్ అప్పట్లో ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. అయితే ఆ తర్వాత తెలుగులో హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఇటీవలి పరిణామాలు మారుతున్న మార్కెట్ సమీకరణల నేపథ్యంలో నెగెటివ్ .. గ్రే షేడ్ ఉన్న పాత్రల వైపు కూడా మొగ్గు చూపే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి తెలుగు సినిమాల్లో ఇప్పుడు హీరో విలన్ మధ్య ఉండే సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో బలమైన ప్రతినాయక పాత్రలకు మంచి ప్రాధాన్యత దక్కుతోంది. కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రీచ్ అయ్యే కథల్లో విలన్ పాత్రలు నటులకు మంచి మైలేజ్ ఇస్తున్నాయనే భావన చాలామందిలో బలపడింది.
సుధీర్ బాబు విషయానికొస్తే ఆయనకు బాడీ లాంగ్వేజ్ పరంగా సీరియస్ ఇంటెన్స్ పాత్రలకు సరిపోయే పర్సనాలిటీ ఉంది. గతంలో వి వంటి చిత్రంలో పోలీస్ అధికారిగా నటించినా? పూర్తిస్థాయి విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందు బలంగా నిలబడలేదు. సుదీర్ బాబు నిజంగానే అలాంటి పాత్రల వైపు అడుగులు వేస్తే ఆయన కెరీర్‌కు సరికొత్త రూపాన్ని ఇచ్చే అవకాశమే ఉంటుంది.
మరోవైపు సోలో హీరోగా చేసే ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టేస్తారా అంటే అలాంటిదేమీ లేదు. కథ నచ్చితే హీరోగా చేస్తూనే బలమైన విలన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వ్యూహంతో ఉన్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న కంఫర్ట్ జోన్ దాటి కొత్తగా ప్రయత్నించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాకపోయినా? సుధీర్ బాబు ఆలోచనల్లో వస్తున్న మార్పులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
