మేల్ vs ఫిమేల్ డైరెక్టర్స్.. సుధా కొంగర అలా అన్నారేంటి?
దర్శకురాలు సుధా కొంగర గురించి అందరికీ తెలిసిందే. నిజ జీవిత ఘటనల ఆధారంగా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు చేయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
By: M Prashanth | 12 Jan 2026 7:33 PM ISTదర్శకురాలు సుధా కొంగర గురించి అందరికీ తెలిసిందే. నిజ జీవిత ఘటనల ఆధారంగా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు చేయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సుధా కొంగర చేసిన పలు సినిమాలు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. సూరరై పోట్రు మూవీకి గాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె.. రీసెంట్ గా పరాశక్తి మూవీని తెరకెక్కించారు.
యంగ్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదలైంది. మరోసారి సుధా మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకంటే.. సీన్స్ రివర్స్ అయింది. నెగిటివ్ అందుకుని పేలవమైన వసూళ్లు సాధిస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో అప్పటి సామాజిక పరిస్థితులతోపాటు పలు సంఘటనల ఆధారంగా తీసిన సినిమా.. ఆడియన్స్ కు అంతగా నచ్చినట్లు లేదు. దీంతో సుధకు నిరాశ ఎదురైంది.
అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి దీశాయి. ఇండస్ట్రీలో మేల్, ఫిమేల్ డైరెక్టర్స్ మధ్య రెమ్యూనరేషన్ గ్యాప్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధ, సినిమా రేంజ్ ఒకటే అయినా పారితోషికం విషయంలో మహిళా దర్శకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఒక మేల్ డైరెక్టర్ కు 100 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారని చెప్పారు.
అదే స్థాయి మూవీ తీసే మహిళా దర్శకురాలికి కేవలం 50 కోట్ల రూపాయలు ఇస్తారని అన్నారు. అలాంటి పరిస్థితులు మార్చేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో ఈక్వెల్ గా రెమ్యునరేషన్ రావాలనే తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పిన ఆమె.. ఆ సమయంలో ఓ హీరోయిన్ కోసం మాట్లాడారు. సదరు బ్యూటీ సినిమాలు కొంతమంది మేల్ స్టార్ల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఆ హీరోయిన్ కు మాత్రం హీరోల పారితోషికంలో పావు వంతు వస్తోందని చెప్పడం గమనార్హం. దీంతో సుధా కొంగర కామెంట్స్ పై అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు మద్దతు తెలుపుతూ, ఇండస్ట్రీలో మహిళలకు సరైన గుర్తింపు, వేతనం దక్కడం లేదని, టాలెంట్ బట్టి పారితోషికం ఇవ్వాలని పలువురు కామెంట్లు చేశారు. అలా చేయకపోవడం అన్యాయమంటూ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో కొందరు మాత్రం మార్కెట్ వ్యవస్థను సరిగా అర్థం చేసుకోకుండా సుధ మాట్లాడారని విమర్శలు చేస్తున్నారు. ఫెమినిజం కార్డు యూజ్ చేస్తున్నారని, బాక్సాఫీస్ రిజల్ట్ బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందని అన్నారు. రూ.500 నుంచి 1000 కోట్ల కలెక్షన్లు సాధించే సినిమాలు చేస్తే, ఆమెకు కూడా రూ. 100 కోట్ల పారితోషికం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం సుధా కొంగర కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
