సౌత్ హీరోలతో ఛాన్స్ కావాలంటే బాలీవుడ్ ఇలా సిద్దమవ్వాలి!
ప్రస్తుతం బాలీవుడ్ తీవ్రమైన కథల కొరతను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన హిందీ సినిమా ఇప్పుడు సరైన కంటెంట్ లేక బాక్సాఫీస్ వద్ద తడబడుతోంది.
By: Srikanth Kontham | 19 Oct 2026 4:00 AM ISTప్రస్తుతం బాలీవుడ్ తీవ్రమైన కథల కొరతను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన హిందీ సినిమా ఇప్పుడు సరైన కంటెంట్ లేక బాక్సాఫీస్ వద్ద తడబడుతోంది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే... బాలీవుడ్ రచయితలు, దర్శకుల ఆలోచనా విధానం మారాలని వారు రాస్తున్న కంటెంట్ వీక్‌గా ఉందంటూ స్వయంగా హిందీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలే బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ హీరోలు హిందీ దర్శకులకు అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలు.. బాలీవుడ్ మారాల్సిన తీరుపై ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమ గ్లోబల్ రేంజ్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలు స్థానిక ప్రతిభకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రాంతీయ కథకులు, దర్శకులు అందిస్తున్న అద్భుతమైన కాన్సెప్ట్‌లు పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. సౌత్‌లో టాలెంట్ పుష్కలంగా ఉండటం, స్థానిక దర్శకులు హీరోల మాస్ .. ఎమోషనల్ ఇమేజ్ను పక్కాగా వాడుకోవడంతో సౌత్ హీరోలు సొంత ఇండస్ట్రీ దర్శకులకే పెద్ద పీట వేస్తున్నారు.
సౌత్ స్టార్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి వెనుకాడటానికి ప్రధాన కారణం కంటెంట్ బలహీనత. గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వంలో `జంజీర్` సినిమా చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర ప్లాప్‌గా నిలవడమే కాకుండా, చరణ్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నందునే సౌత్ స్టార్స్ హిందీ దర్శకుల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు.
బాలీవుడ్ దర్శకులు సౌత్ హీరోల డేట్స్ సాధించాలంటే? వారి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారాలి. కేవలం భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ విజువల్స్ మాత్రమే సరిపోవని కట్టిపడేసే కథనంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న కథల ను రాయడం నేర్చుకోవాలి. బాలీవుడ్ రైటింగ్ టీమ్స్ రియాలిటీకి దూరంగా కాకుండా ఆడియన్స్ ఎమోషన్స్‌ను తాకేలా స్క్రిప్ట్‌లు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనికితోడు సౌత్ హీరోల మాస్ ఇమేజ్, వారి ఫ్యాన్ బేస్ లెక్కలను బాలీవుడ్ దర్శకులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ హీరోల ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్లను ఉత్తరాది దర్శకులు సరిగ్గా హ్యాండిల్ చేయలే కపోతున్నారనే విమర్శ ఉంది. కాబట్టి సౌత్ ఆడియన్స్ పల్స్ .. పాన్-ఇండియా ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్ట్రాంగ్ విలనిజమ్, హై-వోల్టేజ్ డ్రామా ఉన్న కథలను రూపోందిస్తేనే సౌత్ స్టార్లను ఒప్పించడం సాధ్యమవుతుంది.
అంతిమంగా బాలీవుడ్ దర్శకులు కంటెంట్‌ను రీ-ఇన్వెంట్ చేసుకుని కొత్త తరహా కథలతో ముందుకొస్తే తప్ప సౌత్ స్టార్ హీరోల తలుపులు తట్టడం సాధ్యం కాదు. రొటీన్ కథలతో సౌత్ వైపు చూస్తే వారికి నిరాశే ఎదురవుతుంది. రైటింగ్ ప్రమాణాలను పెంచుకుని ఆర్గానిక్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌ను అందిస్తేనే సౌత్-నార్త్ కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే ఆస్కారం ఉంటుంది. అప్పుడే ధైర్యంగా చాలా మంది సౌత్ స్టార్స్ ముందుకు రాగలరు.
