హాలీవుడ్ స్ట్రీట్ ఫైటర్: విద్యుత్ జమ్వాల్ యాక్షన్ ట్రీట్ వేరే లెవల్
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన పారామౌంట్ పిక్చర్స్ - లెజెండరీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా `స్ట్రీట్ ఫైటర్` గేమింగ్ ఫ్రాంచైజీని సరికొత్తగా రీబూట్ చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 18 April 2026 9:29 AM ISTహాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన పారామౌంట్ పిక్చర్స్ - లెజెండరీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా `స్ట్రీట్ ఫైటర్` గేమింగ్ ఫ్రాంచైజీని సరికొత్తగా రీబూట్ చేస్తున్నాయి. 2026లో విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన `సినీకాన్ 2026` ట్రైలర్ గ్లింప్స్‌లో భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ మెరవడం విశేషం. ఈ చిత్రంలో ఆయన `ధల్సిమ్` అనే ఐకానిక్ యోగి పాత్రను పోషిస్తున్నారు. ఇది అతడి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది.
ట్రైలర్‌లో విద్యుత్ జమ్వాల్ లుక్ - బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అతడు హాలీవుడ్ యాక్షన్ స్టార్లకు ఏమాత్రం తగ్గని విధంగా కనిపిస్తున్నారు. యోగా - మార్షల్ ఆర్ట్స్ తెలిసిన `ధల్సిమ్` పాత్రలో తన విలక్షణమైన శైలిని ప్రదర్శించబోతున్నారు. జేసన్ మోమోవా బ్లాంకాగా, నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉండటం గర్వకారణం. విద్యుత్ జమ్వాల్ వేషధారణ, అతడి కళ్ళలో కనిపించే తీక్షణత అంతర్జాతీయ స్థాయిలో మన నటుల ప్రతిభను చాటిచెబుతోంది. ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ ఫైటర్ ట్రైలర్ లో విద్యుత్ అందరినీ డామినేట్ చేస్తున్నాడు.
స్ట్రీట్ ఫైటర్ గేమ్ స్ఫూర్తితో గతంలో భారతీయ సినిమాల్లో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 90లలో వచ్చిన అనేక యాక్షన్ చిత్రాలలో ఫైటింగ్ గేమ్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన `స్ట్రీట్ ఫైటర్` (1995) సినిమా నేరుగా ఈ పేరుతోనే వచ్చి అప్పట్లో మాస్ ఆడియన్స్‌ను అలరించింది. అలాగే హాలీవుడ్ స్ట్రీట్ ఫైటర్ సినిమా స్ఫూర్తితో రూపొందిన యాక్షన్ సీక్వెన్స్‌లను మన వెంకటేష్ నటించిన `సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో కూడా చూడవచ్చు.
ప్రస్తుతం వస్తున్న ఈ రీబూట్ వెర్షన్ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. 1993 కాలం అప్పటి నేపథ్యంలో సాగే ఈ కథలో కేవలం ఫైటింగ్‌లు మాత్రమే కాకుండా.. బలమైన ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒకప్పటి గేమ్ ఫీల్‌ను తీసుకురావడానికి మేకర్స్ `కౌంట్‌డౌన్ టైమర్` వంటి సౌండ్ ఎఫెక్ట్స్‌ను వాడటం అభిమానులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ జమ్వాల్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఏ స్థాయి యాక్షన్‌ను పండిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒక భారతీయ నటుడు ఇలాంటి భారీ హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీలో భాగమవ్వడం మన సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ రేంజ్‌కు వెళ్లేందుకు నిదర్శనం. విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్ ఎంట్రీతో టాలీవుడ్, బాలీవుడ్ నటులకు అంతర్జాతీయ వేదికలపై మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది. పూర్తి స్థాయి ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ గ్లింప్స్ ఒక చిన్న ట్రీట్ లాంటిదే అని చెప్పవచ్చు. ఈ సినిమా విజయం సాధిస్తే.. భవిష్యత్తులో హాలీవుడ్ చిత్రాలలో మరిన్ని భారతీయ ముఖాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో బెంచ్ మార్క్ సెట్ చేసిన విద్యుత్ జమ్వాల్ కెరీర్ గ్రోత్ కి హాలీవుడ్ స్ట్రీట్ ఫైటర్ సహకరిస్తుందని ఆశిద్దాం.
