Begin typing your search above and press return to search.

స్త్రీ 3 స్క్రిప్ట్ పూర్తి.. కానీ సెట్స్‌పైకి వెళ్లడానికి అసలు కారణం అదే!

అయితే `స్త్రీ 3` సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు దర్శకుడు అమర్ కౌశిక్ మరొక ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిం చనున్నారు.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 12:00 AM IST
స్త్రీ 3 స్క్రిప్ట్ పూర్తి.. కానీ సెట్స్‌పైకి వెళ్లడానికి అసలు కారణం అదే!
X

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హారర్-కామెడీ ఫ్రాంచైజీ `స్త్రీ` నుంచి మూడో భాగం `స్త్రీ 3` త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా `స్త్రీ 3` విడుదల తేదీకి సంబంధించి నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ చిత్రం 2028 లో విడుద‌ల చేస్తున్న‌ట్లు దినేష్ విజన్ వెల్లడించారు. దర్శకుడు అమర్ కౌశిక్ ఇప్పటికే `స్త్రీ 3` కథా చర్చలు ముగించి స్క్రిప్ట్ రాయడం పూర్తి చేశారని తెలిపారు. ప్రేక్షకులు మొదటి రెండు భాగాల్లో ఇష్టపడిన వినోదం, థ్రిల్ ఇందులోనూ సమృద్ధిగా ఉంటాయని, కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగు స్తుందనేది ప్రేక్షకులకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ చిత్రాన్ని 2028 స్వాతంత్ర‌దినోత్స‌వం లేదా క్రిస్మస్ కానుకగా విడుదల చేసే అవకాశం ఉంద‌న్నారు.

అయితే `స్త్రీ 3` సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు దర్శకుడు అమర్ కౌశిక్ మరొక ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిం చనున్నారు. భగవాన్ పరశురాముడి జీవిత ఆధారంగా `మహాఅవతార్` పేరుతో నిర్మిస్తున్న పౌరాణిక చిత్రంలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే `మహాఅవతార్` చిత్రీకరణను జూన్ నాటికి పూర్తి చేసి.. అటుపై వచ్చే ఏడాది చివర్లో `స్త్రీ 3` షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నట్లు దినేష్ విజన్ వివరించారు.

ఈ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంట మరోసారి `స్త్రీ 3`లో ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. మొదటి భాగం నుంచి ఈ సిరీస్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కాంబినేషన్, మూడో భాగంలో మరిన్ని ట్విస్టులు, హాస్యంతో అలరించడానికి సిద్ధమవుతుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం, నిరేన్ భట్ స్క్రిప్ట్ రైటింగ్ ఫ్రాంచైజీకి ప్రధాన బలమని చిత్రబృందం నమ్ముతోంది.

ఈ సందర్భంగా నటుడు రాజ్‌కుమార్ రావు `స్త్రీ` మొదటి భాగం సమయానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2018లో వచ్చిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద 70-75 కోట్లు వసూలు చేస్తున్నప్పుడు దర్శకుడు అమర్ కౌశిక్ కొంత కంగారు పడ్డాడని.. మొదటి సినిమాకే ఈ స్థాయిలో స్పందన రావడం ఆయ‌న్ని ఆశ్చర్య పరిచిందన్నారు. అదే అనుభవంతో `స్త్రీ 2` సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్వీకరించడానికి అమర్ కౌశిక్ ముందే మానసికంగా సిద్ధపడి ఉన్నారని తెలిపారు.

మడోక్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ హారర్-కామెడీ యూనివర్స్ బాలీవుడ్‌లోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చందేరి పట్టణ నేపథ్యం, సర్కటే రాక్షసుడి కథాంశంతో వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన `స్త్రీ 2`లో పంకజ్ త్రిపాఠి, అపార్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీలు ముఖ్య పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే.