Begin typing your search above and press return to search.

నేపాల్ వరద బాధితులకు కే-పాప్ స్టార్ సాయం!

ప్రపంచంలో తనదైన సంగీతంతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ సెన్సేషన్ కే-పాప్ స్ట్రే కిడ్స్ బ్యాండ్ సభ్యుడు లీ నో ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు.

By:  Srikanth Kontham   |   31 Aug 2026 12:58 PM IST
నేపాల్ వరద బాధితులకు కే-పాప్ స్టార్ సాయం!
X

ప్రపంచంలో తనదైన సంగీతంతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ సెన్సేషన్ కే-పాప్ స్ట్రే కిడ్స్ బ్యాండ్ సభ్యుడు లీ నో ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితుల ఉపశమనం కోసం ఆయన 100 మిలియన్ దక్షిణ కొరియన్ వోన్లను (సుమారు 75,000 డాలర్లు) విరాళంగా ప్రకటించారు. వరద బాధితులకు ఈ చిన్న సహాయం కొంతైనా ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ సహాయక సంస్థ వరల్డ్ విజన్ ద్వారా లీ నో ఈ భారీ మొత్తాన్ని అందజేశారు.

నేపాల్‌లో సంభవించిన ప్రాణాంతక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంతోమంది ఇళ్లు కోల్పోయి వీధిన పడటంతో పాటు నిత్యావసరాలు లభించక అల్లాడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి బాధితులకు ఆహారం, తాగునీరు , వైద్య సహాయం అందించడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ విరాళం సందర్భంగా లీ నో మాట్లాడుతూ.. `వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన నేపాల్ ప్రజల వార్తలు విని నా హృదయం కలచివేసింది. ఈ కష్ట సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యంగా చిన్నారులకు నా సహాయం కొంతైనా ధైర్యాన్ని,ఉపశమనాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.

బాధితులంతా త్వరగా తేరుకుని సాధారణ జీవితానికి తిరిగిరావాలని కోరుకుంటున్నాను` అని ఆకాంక్షించారు. సామాజిక సేవ - దాతృత్వంలో లీ నో తొలి నుంచి ముందు వరుసలో ఉంటున్నారు. వరల్డ్ విజన్ బాబ్ పియర్స్ ఆనర్ క్లబ్లో సభ్యుడిగా ఉన్న ఆయన గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంభవించిన సహజ విపత్తులు, ఆకలి తీర్చే కార్యక్రమాలు , చిన్నపిల్లల సంక్షేమం కోసం మిలియన్ల కొద్దీ నిధులను అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న కే-పాప్ స్టార్లు ఇలా సామాజిక బాధ్యతతో స్పందించడం అభిమానులపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. వారిని చూసి మ‌రింత మంది సంగీత ప్రియుల‌కు స‌హాయం అందించ‌డానికి ముందుకు రావ‌డం విశేషం. స్టార్‌డమ్‌ను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా కష్టాల్లో ఉన్న తోటి మానవాళిని ఆదుకోవడానికి ఉపయోగించడం ద్వారా లీ నో గ్లోబల్ ఐకాన్‌గా ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.

మొత్తానికి కే-పాప్ పరిశ్రమ నుంచి వస్తున్న ఉదారతా కార్యక్రమాలు వినోద రంగానికే పరిమితం కాకుండా, సమాజంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో లీ నో లాంటి ఐకాన్స్ చూపించే మానవతా దృక్పథం రాబోయే రోజుల్లో ఇతర విదేశీ సెలబ్రిటీలు ,వారి గ్లోబల్ అభిమాన వర్గాలు కూడా ఇలాంటి విపత్తుల సమయాల్లో స్పందించి సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావడానికి బలమైన ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.