`ఈగ`తో బ్రహ్మాస్త్రం.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
అయితే శంకర్ కంటే ముందు, శంకర్ తర్వాత వీఎఫ్ఎక్స్ పరంగా భారతీయ సినీపరిశ్రమలో చాలా మంది ప్రయోగాలు చేసారు. కానీ సౌత్ నుంచి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు.
By: Sivaji Kontham | 28 Dec 2025 12:00 PM ISTవిజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం అంతగా లేని రోజుల్లో దక్షిణాది చిత్రసీమలో ఎస్.శంకర్ చేసిన ప్రయోగాలు అసాధారణమైనవి. ఆయన తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రాలలో `భారతీయుడు` (1996) వీఎఫ్ఎక్స్ పనితనానికి బెంచ్ మారక్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రశాంత్- ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన `జీన్స్` చిత్రం కోసం వర్చువల్ విజువల్స్ ని క్రియేట్ చేసి భారతీయ ప్రేక్షకులను అబ్బురపరిచిన ఘనత కూడా శంకర్ కే దక్కుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల ఒక దశాబ్ధం పాటు శంకర్ పేరు మార్మోగింది. ఇటీవల అతడికి వరుస పరాజయాలు ఎదురవ్వడంతో రేసులో కొంత వెనకబడిపోయాడు కానీ విజువల్ గా మాస్టర్ పీస్‌లు అందించిన సౌత్ దర్శకుడిగా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
అయితే శంకర్ కంటే ముందు, శంకర్ తర్వాత వీఎఫ్ఎక్స్ పరంగా భారతీయ సినీపరిశ్రమలో చాలా మంది ప్రయోగాలు చేసారు. కానీ సౌత్ నుంచి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అతడు రూపొందించిన ఈగ (2012) చిత్రం భారతీయ సినిమా హిస్టరీలో మాస్టర్ పీస్ గా నిలిచింది. అసలు స్టార్లతో పని లేకుండా ఒక కీటకాన్ని కూడా హీరోని చేయవచ్చని నిరూపించిన చిత్రమిది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో ఈగ కథను జక్కన్న ఎలివేట్ చేసిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ ని మెప్పించింది. ఈగ పాత్ర క్రియేషన్ కోసం హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టారంటూ కొన్ని విమర్శలు ఉన్నా కానీ, ఈగ పాత్రను భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మలిచిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ స్టాండార్డ్స్ ని అందిపుచ్చుకున్న విధానం ప్రతిదీ నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. ఒక ఈగ జీవనవిధానం, పగ ప్రతీకారం అంటూ తిరిగే సన్నివేశాలను, పాత్రను అతిశయోక్తి లేకుండా డిజైన్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. రాజమౌళి ఏం చేసినా అది పూర్తి స్పష్ఠతతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని గుర్తింపు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతోనే కాదు, ప్రయోగాత్మక కథలతోను నిరూపించగల నిష్ణాతుడిగా జక్కన్న గుర్తింపు పొందాడు.
ఒక ఈగ కథను అతడు కమర్షియల్ గా చెప్పి మెప్పించగలిగిన తీరు నిజంగా ఒక వండర్. బాహుబలి లాంటి భారీ ఫ్రాంఛైజీ చిత్రాలకు తెర లేపక ముందే రాజమౌళి పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది. ఇప్పుడు ఈ సినిమాని రీరిలీజ్ చేసేందుకు రాజమౌళి టీమ్ సన్నాహకాల్లో ఉంది. ఈగ చిత్రాన్ని 2026లో భారతదేశంతో పాటు, విదేశాలలోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్.ఎస్. రాజమౌళి-వారణాసి ప్రాజెక్ట్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మహేష్ సినిమా విడుదలకు ముందే ఈగ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులు వీక్షించేందుకు అందుబాటులోకి వస్తుంది. ఇది నిజంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నంగా చూడాలి. సాంకేతికంగా రాజమౌళిని ప్రపంచం మరోసారి అర్థం చేసుకోవడానికి ఈగ సహకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాని, సమంత కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం చాలా సందర్భోచితంగా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువరిస్తారని తెలిసింది.
ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ కథానాయకుడిగా భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం `వారణాసి`(మహేష్ 29వ సినిమా)ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, సూపర్ హీరో క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. ఈగ, బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో వీఎఫ్ఎక్స్ ని కూడా ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. 2027లో వారణాసి విడుదలవుతుంది.
