Begin typing your search above and press return to search.

' స్ట్రేంజర్ థింగ్స్ యానిమేషన్ సిరీస్'కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

చివరి సీజన్ విషయానికి వస్తే హాకిన్స్ పట్టణంలోని చిన్నారుల బృందం గత సీజన్లో వెక్నా సృష్టించిన భయానక వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు.

By:  Madhu Reddy   |   1 Dec 2025 1:01 PM IST
 స్ట్రేంజర్ థింగ్స్ యానిమేషన్ సిరీస్కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
X

స్ట్రేంజర్ థింగ్స్.. ఈ వెబ్ సిరీస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను ఉర్రూతలూగించించిన మెగా హిట్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఈ ఏడాదితో చివరి సీజన్ కూడా పూర్తి చేసుకోబోతోంది. ముఖ్యంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకోబోతున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్ రావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సీజన్ 5ను మూడు భాగాలుగా నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. నవంబర్ 27 నుండి మొదటి వ్యాల్యూమ్ లో భాగంగా.. 4 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతుండగా.. వాల్యూమ్ 2 తర్వాత మూడు ఎపిసోడ్లతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 26న స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ సిరీస్ గ్రాండ్ ఫినాలే 8వ ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ భాషలతో సహా 25 కు పైగా భాషల్లో డబ్బింగ్ అయ్యి అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్త అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

చివరి సీజన్ విషయానికి వస్తే హాకిన్స్ పట్టణంలోని చిన్నారుల బృందం గత సీజన్లో వెక్నా సృష్టించిన భయానక వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ తోపాటు ఎమోషన్స్ తో నిండిన ఈ ఫైనల్ సీజన్ చాలా అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ పూర్తవుతోందని తెలిసి అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేయగా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారికి మరో శుభవార్తను అందించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రేంజర్ థింగ్స్ యానిమేటెడ్ సిరీస్ ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.

"స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85" పేరుతో ఈ యానిమేషన్ సిరీస్ ను వచ్చే ఏడాది 2026 లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. 1985లో హాకిన్స్ లో ఏం జరిగింది? 80ల నాటి యానిమేషన్ శైలిని కలిగి ఉన్న ఈ సీరిస్ లోని అసలు పాత్రలు కొత్త రాక్షసులతో ఎలా పోరాడగలిగారు? అనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నారు. ముఖ్యంగా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 అలాగే సీజన్ 3 మధ్య ఏం జరిగింది? అనే కథను ఈ సీరీస్ లో చూపించబోతున్నారు. ఇక స్ట్రేంజర్ థింగ్స్ యానిమేషన్ సిరీస్ కి ఫ్లయింగ్ బార్క్ అనే సంస్థ ప్రొడక్షన్ విభాగంలో సహకారం అందిస్తోంది.

ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశంతో ఏకంగా ఐదు సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ స్ట్రేంజర్ థింగ్స్.. ఇప్పుడు సరికొత్తగా యానిమేషన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ యానిమేషన్ సిరీస్ ఆడియన్స్ కు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.