అనుమానాస్పద రీతిలో వర్జిన్ రివర్ నటుడు మృతి!
ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘విర్జిన్ రివర్’ ఫేమ్, కెనడియన్ నటుడు స్టీవర్ట్ మెక్ లీన్ (45) ఆకస్మిక మరణం ఇప్పుడు అంతర్జాతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Madhu Reddy | 24 May 2026 4:29 PM ISTప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘విర్జిన్ రివర్’ ఫేమ్, కెనడియన్ నటుడు స్టీవర్ట్ మెక్ లీన్ (45) ఆకస్మిక మరణం ఇప్పుడు అంతర్జాతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మే మధ్యలో అదృశ్యమైన ఆయన, కేవలం కొన్ని రోజుల్లోనే శవమై కనిపించడం పెను కలకలం రేపింది. మొదట మిస్సింగ్ కేసుగా భావించినప్పటికీ, పోలీసులు ఇప్పుడు దీనిని ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా అనుమానిస్తున్నారు. ఈ మిస్టరీ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అన్నది తెలియాల్సివుంది.
అదృశ్యం.. ఆపై శవమై లభ్యం:
నటుడు స్టీవర్ట్ మెక్ లీన్ మే 15,న చివరిసారిగా బయట కనిపించారు. ఆ తర్వాత ఆయన గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, మే 18న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రిటిష్ కొలంబియాలోని లయన్స్ బే ప్రాంతం నుండి ఆయన అదృశ్యమైనట్లు గుర్తించారు. అయితే దురదృష్టవశాత్తూ, గాలింపు చర్యలు చేపట్టిన కొద్ది రోజులకే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ బృందానికి స్టీవర్ట్ మృతదేహం లభ్యమవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.
రంగంలోకి హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్:
స్టీవర్ట్ మెక్ లీన్ మరణం సాధారణంగా జరిగింది కాదని పోలీసులు ప్రాథమిక విచారణలోనే గుర్తించారు. ఇందులో పెద్ద కుట్ర కోణం దాగి ఉందని అనుమానిస్తూ.. కేసును వెంటనే కెనడాలోని ప్రముఖ ‘ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును పూర్తిస్థాయి హత్య దర్యాప్తుగా మార్చారు. ఇక ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరిస్తూ, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను అధికారులు జల్లెడ పడుతున్నారు.
హాలీవుడ్‌లో మంచి గుర్తింపు:
స్టీవర్ట్ మెక్ లీన్ తన అద్భుతమైన నటనతో హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పాపులర్ నెట్‌ఫ్లిక్స్ డ్రామా సిరీస్ విర్జిన్ రివర్ తో పాటు ఆరో వంటి హిట్ షోలలో ఆయన నటించారు. ఇక పలు స్కాటిష్ టెలివిజన్ డ్రామాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. వాంకోవర్‌కు చెందిన ప్రముఖ లూకాస్ టాలెంట్ ఏజెన్సీ ఆయనకు ప్రతినిధిగా వ్యవహరించింది. ఇక ఇంతలోనే ఆయన ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని తోటి నటీనటులు తట్టుకోలేకపోతున్నారు.
సరిగ్గా కెరీర్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలో 45 ఏళ్ల స్టీవర్ట్ మెక్ లీన్ ఇలా ప్రాణాలు కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటు. ఆయనను ఎవరైనా కావాలనే టార్గెట్ చేసి హత్య చేశారా? లేక దీని వెనుక మరేదైనా వ్యక్తిగత శత్రుత్వాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ కేసులోని నిజాలు అన్ని బయటకు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి..
